
‘పల్లె’వించిన కక్ష రాజకీయం
సాక్షి, పుట్టపర్తి: ఆయనో విద్యాధికుడు...కొన్నేళ్ల పాటు పిల్లలకు పాఠాలు చెప్పారు. కానీ రాజకీయంలోకి దిగాక కొత్త పాఠం నేర్చుకున్నారు. ప్రశ్నిస్తే బెదిరించడం... ఎదురొస్తే దాడులు చేయించడం ద్వారా తనకు ఎదురేలేకుండా చేసుకుంటున్నారు. ముఖ్యంగా కూటమిలోని జనసేన, బీజేపీ నేతలను టార్గెట్ చేశారు. ‘ఇది కూటమి ప్రభుత్వం... మేమంతా ఒక్కటే’ అంటూ ఆయా పార్టీల నేతలు ఊరూరా చెప్పుకుంటూ తిరుగుతుండగా... పుట్టపర్తిలో మాత్రం ‘పల్లె’ మిత్రపక్షాల నేతలను టార్గెట్ చేశారు. అధికారం అడ్డు పెట్టుకుని.. పోలీసులతో రాజకీయం చేస్తూ కేసులు, అరెస్టులు అంటూ బీజేపీ, జనసేత నేతలను నిత్యం వేధిస్తున్నారు. తమ ప్రభుత్వంలో తమపైనే దాడులు జరుగుతున్నా బయటకు చెప్పుకోలేక సతమతమవుతున్నారు.
బీజేపీ నేతలపై కక్ష సాధింపు..
పెనుకొండ సమీపంలోని ‘కియా’ కార్ల పరిశ్రమ వద్ద గతంలో తన అనుచరులు, స్నేహితులను కలుపుకుని వందల ఎకరాల భూమి కొన్నారు. ఆ తర్వాత విలువ ఆధారంగా పంపకాలు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత వాటాల్లో తేడా కారణంగా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అడ్డం తిరిగినట్లు ఆరోపణలున్నాయి. కొందరు అల్లరిమూకలను రెచ్చగొట్టి.. పదే పదే రోడ్లు ధ్వంసం చేయించడం.. బీజేపీ నేత ఆదినారాయణయాదవ్‌పై కేసు నమోదు చేయించడం పనిగా పెట్టుకున్నాడు. సుమారు రూ.80 కోట్లు విలువ చేసే భూమిని పల్లె రఘునాథరెడ్డి కబ్జా చేయాలని చూస్తున్నారని ఆదియాదవ్ ఆరోపిస్తున్నారు. గత ఆర్నెల్లుగా ఇద్దరి మధ్య వివాదాలు జరుగుతూనే ఉన్నాయి.
జనసేన నేతను చితకబాదించి..
అమడగూరు మండలానికి చెందిన జనసేన నాయకుడు పసుపులేటి రమేష్‌పై మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కక్షగట్టారు. ‘పల్లె’ అవినీతికి సంబంధించిన సమాచారం మొత్తం తన వద్ద ఉందని రమేష్ చెప్పడంతో.. పల్లె భయపడిపోయినట్లు సమాచారం. అవన్నీ ఎక్కడ దాచారో చెప్పేవరకు చితకబాదాలని పోలీసులకు ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై గతంలో పల్లె రఘునాథరెడ్డి చేసిన వ్యాఖ్యలను పసుపులేటి రమేష్ ఖండించినందుకే ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. అక్కడి నుంచి రమేష్‌పై కక్ష సాధింపుల పరంపర కొనసాగుతోంది. ఇటీవలే షరతులతో కూడిన బెయిల్‌పై బయటికి వచ్చిన రమేష్‌ను పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు అరెస్టు చూపలేదు. దీంతో అతని తండ్రి ‘నా కొడుకు ఆచూకీ తెలపండి స్వామీ, నా కొడుకు ఏమైపోయాడో అని అన్నహారాలు మాని ఎదురుచూస్తున్నాం’ అంటూ ఆవేదన చెందుతూ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పాత్రికేయులకూ బెదిరింపులు..
తన అవినీతి బాగోతాలన్నీ పత్రికల ద్వారా వెలుగులోకి తెచ్చిన పాత్రికేయులపైనా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కేసులు పెట్టించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా కొందరు అల్లరి మూకలతో భౌతికదాడి చేయించేందుకు కూడా వెనుకాడటంలేదు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ పత్రికా ప్రతినిధిపై కక్ష గట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు.
‘పల్లె’ కనుసన్నల్లోనే పోలీసులు..
పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అయినప్పటికీ నియోజకవర్గ వ్యాప్తంగా పల్లె రఘునాథరెడ్డి ఆదేశాలతోనే పోలీసు వ్యవస్థ నడుస్తోందనే విమర్శలున్నాయి. ఎలాంటి హోదా లేకున్నా.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ పోలీసులతో సెల్యూట్ చేయించుకుంటున్నారు. ఎలాంటి కేసయినా సరే తనకు చెప్పిన తర్వాతే నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే తనమాట వినని ఓ ఇన్‌స్పెక్టర్‌పై బదిలీ వేటు వేయించారని స్థానికులు చర్చించుకుంటున్నారు.
పుట్టపర్తిలో బీజేపీ, జనసేన నేతలను టార్గెట్ చేసిన ‘పల్లె’
ఎదురొస్తే తాట తీయిస్తానంటూ
బెదిరింపులు
ఇప్పటికే బీజేపీ నేత ఆదియాదవ్‌కు
ఇబ్బందులు
తాజాగా జనసేన నేత
పసుపులేటి రమేశ్ అరెస్టు
మాజీ మంత్రి దెబ్బకు
అల్లాడిపోతున్న కూటమి నేతలు