జిల్లా జడ్జి బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

జిల్లా జడ్జి బాధ్యతల స్వీకరణ

Apr 20 2025 2:00 AM | Updated on Apr 20 2025 2:00 AM

జిల్ల

జిల్లా జడ్జి బాధ్యతల స్వీకరణ

అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా జడ్జిగా ఈ. భీమా రావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు ఉన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్‌ నెల్లూరు జిల్లాకు బదిలీ అయిన సంగతి విదితమే. చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న ఈ. భీమా రావును అనంతపురం కోర్టుకు బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన భీమారావును బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గురుప్రసాద్‌, జనరల్‌ సెక్రటరీ వెంకటరాముడు, వైస్‌ ప్రెసిడెంట్‌ ధర్మసింగ్‌ నాయక్‌, ట్రెజరర్‌ వెంకట రఘుకుమార్‌ తదితరులు సత్కరించారు.

22న ‘పురం’లో

మెగా జాబ్‌మేళా

ప్రశాంతి నిలయం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 22న హిందూపురంలోని శ్రీ బాలాజీ విద్యా విహార్‌ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్‌మేళా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ తెలిపారు. జిల్లాలోని యువతీ, యువకులు జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శనివారం ఆయన తన చాంబర్‌లో జాబ్‌మేళా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జాబ్‌మేళాలో 20 మల్టీనేషనల్‌ కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమో, బీటెక్‌, బీ.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, పీజీ కోర్సులు చదివిన వారు జాబ్‌మేళాలో పాల్గొనవచ్చన్నారు. ఆయా కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారన్నారు. పూర్తి వివరాల కోసం 9676706976, 9966682246 నంబర్లలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్‌ అధికారి హరికృష్ణ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

ఈ–కేవైసీ చేయించుకోండి

ప్రశాంతి నిలయం: జిల్లాలోని రేషన్‌ కార్డుదారులందరూ ఏప్రిల్‌ 30వ తేదీలోపు ఈ–కేవైసీ చేయించుకోవాలని, లేకపోతే రేషన్‌ సరుకులు ఇవ్వబోరని జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో కార్డుదారులు ఈ–కేవైసీ చేయించుకోకపోయినా రేషన్‌ సరుకులు ఇచ్చేవారని, ఏప్రిల్‌ 30 నుంచి అలాంటి పరిస్థితి ఉండదన్నారు. ఈ–కేవైసీ చేయించుకోని వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనం చేకూరదన్నారు. జిల్లాలో 16,89,531 రేషన్‌ కార్డుదారులుండగా, ఇప్పటి వరకు 15,48,523 మంది ఈ–కేవైసీ చేయించుకున్నారని, ఇంకా 1,11,673 మంది ఈ–కేవైసీ చేయించుకోవాల్సి ఉందన్నారు. వారంతా వెంటనే ఆయా గ్రామ సచివాలయాలు, రేషన్‌ షాపుల్లో ఈ–పాస్‌ యంత్రాల ద్వారా ఈ– కేవైసీ నమోదు చేసుకోవాలని సూచించారు. 5 ఏళ్లలోపు, 80 ఏళ్లు పైబడి వయస్సు కలిగిన వారికి ఈ–కేవైసీ నుంచి మినహాయింపు ఉంటుందన్నారు.

జేఈఈ మెయిన్స్‌లో

ర్యాంకుల పంట

కదిరి అర్బన్‌: జేఈఈ మెయిన్స్‌ రెండోసెషన్‌లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన ఎన్‌ఐటీ, త్రిపుల్‌ ఐటీల్లో బీటెక్‌, బీఈ కోర్సుల ప్రవేశాలకు నేషనల్‌ టెస్ట్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. రెండు విడతల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. ఈ పరీక్షల్లో జిల్లా నుంచి పలువురు విద్యార్థులు జాతీయ స్థాయి ర్యాంకులు సాధించారు. కదిరికి చెందిన చంద్రమోహన్‌రెడ్డి కుమార్తె కనిష్క 99.78 శాతం పర్సంటైల్‌తో ఆల్‌ ఇండియా స్థాయిలో 3411 ర్యాంకు సాధించింది. అలాగే పట్టణానికి చెందిన ఓబులపతి కుమారుడు ఓం కిరణ్‌ 99.91 శాతం పర్సంటైల్‌తో ఓబీసీ కేటగిరీలో 252 ర్యాంకు, జనరల్‌ కేటగిరీలో 1462 ర్యాంకు దక్కించుకున్నాడు. అలాగే రమణారెడ్డి కుమారుడు అనీష్‌రెడ్డి 2460 ర్యాంక్‌ సాధించాడు.

జిల్లా జడ్జి బాధ్యతల స్వీకరణ 1
1/2

జిల్లా జడ్జి బాధ్యతల స్వీకరణ

జిల్లా జడ్జి బాధ్యతల స్వీకరణ 2
2/2

జిల్లా జడ్జి బాధ్యతల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement