బీసీల ద్రోహి చంద్రబాబు
పరిగి: ‘‘ఓట్ల కోసం బీసీ జపం చేసే చంద్రబాబు, కూటమి పార్టీల్లోని నేతలు ఏనాడూ బీసీల అభ్యున్నతికి కృషి చేయలేదు. పైగా బీసీలను అణగదొక్కేందుకు, అంతంచేందుకు ప్రయత్నించారు. కానీ బీసీలంటే ఎనలేని ప్రేమ చూపే జగనన్న బీసీ అంటే బ్యాక్‌బోన్ క్యాస్ట్ అని చెప్పడంతో పాటు తన హయాంలో పదవులిచ్చి పాలనలో భాగస్వామ్యం చేశారు. రాష్ట్రంలో బీసీ పక్షపాతి ఎవరైనా ఉన్నారంటే అది జగనన్నే. అందుకే కురుబ లింగమయ్య హత్యతో ఆయన చలించిపోయారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చారు. ఇలా చేయగలిగిన కూటమి నేత ఎవరైనా ఉన్నారా..కనీసం బీసీ మంత్రిగా ఉన్న సవిత అయినా ఆ కుటుంబాన్ని పరామర్శించరా’’ అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ ప్రశ్నించారు. శుక్రవారం ఆమె మండలంలోని కొడిగెనహళ్లి పంచాయతీ పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డిపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల రామగిరి మండలంలో పాపిరెడ్డిపల్లిలో టీడీపీ గూండాల చేతిలో గాయపడి మృతి చెందిన కురుబ లింగమయ్య కుటుంబాన్ని కూటమి పార్టీల్లోని ఒక్క బీసీ ప్రజాప్రతినిధి అయినా కనీసం పరామర్శించారా.. అని ప్రశ్నించారు. పైగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు తామంతా బాధిత కుటుంబానికి అండగా నిలిబడితే దాన్ని కూడా తప్పుపడుతూ విమర్శలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి పార్టీల నేతలకు బీసీలపై ఉన్న ప్రేమకు ఈ ఘటనే నిదర్శనమన్నారు. బీసీ మంత్రిగా ఉన్న కురుబ సామాజిక వర్గానికి చెందిన సవితకు హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించే తీరక లేదా అని ప్రశ్నించారు.
ఎంపీపీ పదవి కోసం దిగజారి రాజకీయం
రామగిరి ఎంపీపీ ఎన్నికలోనూ కూటమి నాయకులు దిగజారి రాజకీయం చేశారన్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున 9 మంది గెలిస్తే ఒక్క ఎంపీటీసీతో ఎంపీపీ సీటు కైవసం చేసుకునేందుకు మంత్రి సవిత, ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ వ్యవహరించిన తీరు చూసి సభ్య సమాజం తలదించుకుంటుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని అధికారులు గమనించి మసలుకోవాలని సూచించారు. తమ స్థాయి గుర్తించి మాట్లాడితే అందరికీ మంచిదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ నరసింహమూర్తి పాల్గొన్నారు.
లింగమయ్య మృతిపై
నేటికీ స్పందించక పోవడం దుర్మార్గం
బాధిత కుటుంబాన్ని జగనన్న
పరామర్శించినా తట్టుకోలేకపోతున్నారు
లింగమయ్య హత్యను కూటమి పార్టీల్లోని
బీసీ నేతలూ ఖండించాలి
మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా
అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్


