నూతన జిల్లా జడ్జిగా భీమా రావు
అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఈ. భీమా రావు నియమితులయ్యారు. చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఆయనను జిల్లాకు బదిలీ చేశారు. ప్రస్తుతం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జి. శ్రీనివాస్ నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. అలాగే, అనంతపురం నాలుగో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి (గుత్తి)గా విధులు నిర్వహిస్తున్న శ్రీహరిని పిఠాపురం అదనపు జిల్లా జడ్జి, సెషన్స్ జడ్జిగా బదిలీ చేశారు. అనంతపురం అదనపు జిల్లా జడ్జి ఎం. శోభారాణి సీబీఐ స్పెషల్ జడ్జి (కర్నూలు)గా బదిలీ అయ్యారు.
● జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన ఈ.భీమారావు 1972లో పిఠాపురంలో జన్మించారు. బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ కాకినాడలో పూర్తి చేశారు. పిఠాపురంలో న్యాయవాది వృత్తిని చేపట్టారు. 2013లో అదనపు జిల్లా జడ్జిగా విజయవాడలో బాధ్యతలు నిర్వర్తించారు. 2017లో ఫ్యామిలీ కోర్టుకు బదిలీ అయ్యారు. అదే సంవత్సరంలోనే విజయనగరం ఫ్యామిలీ కోర్టు కమ్–నాలుగో అదనపు జిల్లా జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. 2020లో పదోన్నతిపై పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.
● నెల్లూరుకు బదిలీపై వెళ్తున్న జడ్జి జి. శ్రీనివాస్ అనంతపురం ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా సంచలన తీర్పులు వెలువరించారు. కందుకూరు శివారెడ్డి హత్య కేసులో నిందితులకు రెండు జీవిత కాలాల కఠిన కారాగార శిక్ష విధించారు. జిల్లా కోర్టు చరిత్రలోనే మొత్తం 12 కేసుల్లో ముద్దాయిలకు జీవిత ఖైదు విధించిన తొలి ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ కావడం గమనార్హం. సివిల్ కేసులనూ 50 శాతం పరిష్కరించి కక్షిదారులకు సాంత్వన చేకూర్చారు.
నెల్లూరు జిల్లా జడ్జిగా జి. శ్రీనివాస్ బదిలీ


