ప్రాణాలు తీసిన అతివేగం
రొళ్ల: అతివేగం రెండు ప్రాణాలను బలిగొంది. ఓవర్ టేక్ చేసే క్రమంలో టిప్పర్‌ను టాటాఏస్ వాహనం ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. రొళ్ల మండలం బీజీ హళ్లికి చెందిన తిప్పేస్వామి కుమార్తె త్రివేణి (26)కి కర్ణాటక రాష్ట్రం మధుగిరి తాలూకా కాటగానహళ్లి చెందిన సిద్ధగంగతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్ల తర్వాత కుటుంబ కలహాల కారణంగా త్రివేణి పుట్టింటికి వచ్చేసింది. ఇంటి వద్ద ఖాళీగా ఉండలేక బెంగళూరులోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. శ్రీరామ నవమి పండుగ నిమిత్తం త్రివేణి పుట్టింటికి వచ్చింది. వరుసకు మామ అయిన మల్లసముద్రం గ్రామానికి చెందిన బద్రీనాథ్ టాటా ఏస్ వాహనంలో బంధువు, అమరాపురం మండలం పి.శివరం గ్రామానికి చెందిన కుమార్ (35) బెంగళూరులో నివాసం ఉండేందుకు ఆదివారం అవసరమైన సామగ్రి వేసుకుని వెళ్తుండగా.. త్రివేణి కూడా అందులోనే బయల్దేరింది. బెంగళూరు సమీపాన నెలమంగల వద్ద జాతీయ రహదారి–4పై ఓవర్‌టేక్ చేసే క్రమంలో టాటా ఏస్ వాహనం అదుపుతప్పి టిప్పర్ లారీని ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో త్రివేణి, కుమార్ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. బద్రీనాథ్ స్వల్ప గాయాలతో బయట పడ్డారు. కుమార్‌కు భార్య శివమ్మ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
టిప్పర్‌ను ఢీకొన్న టాటాఏస్
ఇద్దరు దుర్మరణం.. మరొకరికి గాయాలు
బెంగళూరు సమీపాన నెలమంగళ వద్ద ఘటన
ప్రాణాలు తీసిన అతివేగం


