అక్రమాలు కోకొల్లలు..
సంపాదన కోసం ఆ రియల్టర్ అడ్డదారులు తొక్కాడు. సహజ వనరులను కబ్జా చేశాడు. చుట్టుపక్కల రైతులు ఏమైపోతే నాకేంటి.. తనకు అన్ని సౌకర్యాలూ ఉంటే చాలనుకున్నాడు. పలువురు అధికారుల అండతో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డాడు.
చిలమత్తూరు: రియల్టర్ రెడ్డెప్పశెట్టి అక్రమాలు బయటపడుతున్న కొద్దీ విస్తుగొల్పుతున్నాయి. నదీ జలాల అక్రమ నిల్వతో పాటు పెద్ద ఎత్తున విద్యుత్ చౌర్యానికి పాల్పడిన తీరు అందరినీ విస్మయ పరుస్తోంది. అందులోనూ పన్నులు కట్టే వ్యక్తి (ట్యాక్స్‌పేయర్)కి 10 దాకా ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఉండడం సంచలనం రేపుతోంది. రెడ్డెప్పశెట్టికి కోడూరు సమీపంలోని చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో వందల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దీనికితోడు చుట్టుపక్కల భూములనూ అక్రమంగా అధీనంలో ఉంచుకున్నాడు. ఇందులో 30 పైచిలుకు బోరుబావులు ఉన్నాయి. వివిధ వ్యక్తుల పేరిట వ్యవసాయం కోసమని ఉచిత విద్యుత్ కనెక్షన్లు తీసుకున్నాడు. అయితే ఆ విద్యుత్‌ను వ్యవసాయానికి కాకుండా ఫ్లోరికల్చర్ – పాలీహౌస్‌లకు వినియోగిస్తున్నాడు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌కు నెలకు రూ.30 బిల్లు కాగా, ఫ్లోరికల్చర్ వినియోగానికి ప్రత్యేకంగా అనుమతి పొంది యూనిట్‌కు రూ.4.50 చొప్పున బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏడేళ్లుగా వ్యవసాయ కనెక్షన్ల పేరిటే ఫ్లోరి కల్చర్ నడుపుతున్నాడు. రియల్టర్ అక్రమాల గురించి ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించడంతో అధికార యంత్రాంగంలో చలనం వచ్చింది. క్షేత్రస్థాయి విచారణ చేపట్టి విద్యుత్ చౌర్యాన్ని గుర్తించారు. ఇటీవలే అతనికి నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో సదరు రియల్టర్ నష్టనివారణ చర్యలకు ఉపక్రమించి విద్యుత్‌శాఖలోని అధికారులతో ఇప్పటికే మంతనాలు జరిపినట్టుగా విశ్వసనీయ సమాచారం. భారీ విద్యుత్ చౌర్యానికి సంబంధించి రూ.40 లక్షల దాకా జరిమానా విధించాల్సి ఉండగా.. దాన్ని రూ.10 లక్షలకే పరిమితం చేయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఏఈ స్థాయిలో అంతకు మించి ఫైన్ వేసే అవకాశం లేదు. ఉన్నతస్థాయి అధికారులు విచారణ జరిపితే భారీగా జరిమానా పడే అవకాశం ఉంది. ఈ అంశంపై విద్యుత్ శాఖ ఈఈ భూపతిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన స్పందించలేదు.
నదీ జలాల అక్రమ నిల్వ..
రియల్టర్ రెడ్డెప్పశెట్టి చిత్రావతి నదిపై అనధికారికంగా బ్రిడ్జి నిర్మించి.. నదీ జలాలు దిగువకు వెళ్లకుండా అడ్డుకట్ట వేశాడు. ఆ నీటిని విద్యుత్ మోటార్ల సాయంతో నిల్వ ఉంచుకుని తన ఫారంపాండ్లు, పాలీహౌస్‌లు, పూలమొక్కలకు మళ్లించాడు. నదీ పరివాహకంలో ఉండే రైతులు నదీ జలాలపై ఎక్కువగా ఆధారపడతారు. ఇలా ఆదిలోనే అడ్డుకట్ట వేసి జలచౌర్యం చేస్తే దిగువన గల రైతుల పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
చెలరేగిపోతున్న రియల్టర్ రెడ్డెప్పశెట్టి
కొందరు అధికారుల
అండదండలతోనే..
యథేచ్ఛగా విద్యుత్ చౌర్యం..
నదీ జలాల అక్రమ వినియోగం
పన్ను చెల్లింపుదారుకు ఉచిత విద్యుత్ వర్తింపు ఏమిటో..?
‘సమాజానికి మేలే చేస్తున్నా’
చిత్రావతి నదిపై అనుమతి లేకుండా బ్రిడ్జి నిర్మించడం.. నదీజలాలను అక్రమంగా నిల్వ ఉంచడం.. విద్యుత్ చౌర్యం చేయడం గురించి రియల్టర్ రెడ్డెప్పశెట్టిని ‘సాక్షి’ విలేకరి ప్రశ్నించగా... తాను సమాజానికి మేలే చేస్తున్నానన్నాడు. తన వల్ల ఏ రైతుకూ నష్టం జరగలేదని చెప్పుకొచ్చాడు. అనవసరంగా పత్రికల్లో రాస్తున్నారంటూ చిందులేశాడు. నీ అంతు చూస్తానని విలేకరిని బెదిరించాడు.
అక్రమాలు కోకొల్లలు..


