రక్తచరిత్రను ప్రజలు హర్షించరు
అనంతపురం ఎడ్యుకేషన్: ‘గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేరూరు డ్యాంను నీటితో నింపితే... నేడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరామ్ రక్తంతో నింపాలని చూస్తున్నారు’ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. రక్తచరిత్రను జిల్లా ప్రజలు ఎన్నటికీ హర్షించరనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని హితవు పలికారు. పరిటాల సునీత బంధువుల దాడిలో తీవ్రంగా గాయపడి అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన కురుబ లింగమయ్య మృతి చెందాడు. ఈ క్రమంలో లింగమయ్య మృతదేహాన్ని మాధవ్ పరిశీలించి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాప్తాడు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని పరిటాల కుటుంబం ఖూనీ చేస్తోందన్నారు. లింగమయ్య, ఆయన కుమారుడిపై పరిటాల వర్గీయులు అత్యంత దుర్మార్గంగా హత్యాయత్నానికి పాల్పడడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాడ్లు, కొడవళ్లతో వెంటాడి లింగమయ్య తలపై దాడి చేశారన్నారు. ఓ వైపు దాడులకు తెగబడుతూనే మరో వైపు బాధితులపైనే దుర్మార్గంగా కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసు వ్యవస్థ కూడా నేరస్తులకు అండగా నిలవడం సిగ్గుచేటన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో మరో రక్తచరిత్రను సృష్టించాలని పరిటాల శ్రీరామ్ చూస్తున్నాడని, ఇలాంటి పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రజాతిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఇలాంటి దాడులు, దౌర్జన్యాలను ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పక ముందే ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
గోరంట్ల మాధవ్


