పుట్టపర్తి టౌన్: కదిరిలో ఈ నెల 19 నుంచి మూడు రోజుల పాటు జరిగే ఖాద్రీశుని బ్రహ్మోత్సవాలకు సాధారణ చార్జీలతోనే 30 ప్రత్యేక బస్ సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం మధుసూదన్ తెలిపారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో జిల్లాలోని అన్ని డిపోల మేనేజర్లు, ట్రాఫిక్, గ్యారేజ్ పర్సన్లు, అకౌంట్స్ విభాగం సూపర్‌వైజర్లతో సమావేశమై మాట్లాడారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా బస్ స్టేషన్లలో తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే కదిరి బ్రహ్మోత్సవాలకు పొరుగు జిల్లాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకూ సాధారణ చార్జీలతో అన్ని డిపోల నుంచి 30 ప్రత్యేక బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల రద్దీని అంచనా వేసి సర్వీసులు తిప్పాలన్నారు.