
కటారుపల్లి వేమన ఆలయ ముఖద్వారం వేమన సమాధి వేమన శిలా విగ్రహం
గాండ్లపెంట: సాంఘిక దురాచారాలు, మూఢనమ్మకాలపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన సంఘ సంస్కర్త, విప్లవకారుడు వేమన సాహిత్యం పామరులను సైతం చైతన్యవంతులను చేసింది. నాటి సమాజంలో నెలకొన్న సమస్యలను అనేక కోణాల్లో దర్శించి లోటుపాట్లు, కుతంత్రాలు, అసమానతలు, దోపిడీలపై సరళమైన భాషలో ఎండగట్టిన మానవతావాదిగా ఆయన ఖ్యాతిగాంచారు. అంటరానితనం ఘోర అపరాధమని సాంఘిక విప్లవకారుడిగా ఎలుగెత్తి చాటారు. కులతత్త్వం, మత మౌఢ్యాన్ని నిరసించిన సంస్కారవాదిగా ఎదిగిన యోగి వేమన ఉత్సవాలు శనివారం నుంచి నాలుగు రోజుల పాటు కటారుపల్లిలో ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.
వేమన చరిత్ర కదిపితే ఎన్నో కథలు..
వేమన చరిత్రను కదిపితే ఎన్నో కథలు పలకరిస్తాయి. చరిత్రను ఎన్నిసార్లు తవ్వినా ఆయన ‘రెడ్డి’ కులస్తుడని స్పష్టమైంది. తొలిసారిగా 1839లో చార్లెస్ ఫిలిఫ్ బ్రౌన్ (సి.పి.బ్రౌన్) ద్వారా వేమన పద్యాలు వెలుగు చూశాయని పరిశోధకులు నిగ్గు తేల్చారు. ఎంతో మంది సంఘ సంస్కర్తలు నేటికీ వేమన సాహిత్యాన్ని కొనియాడుతున్నారు. సాంఘిక దురాచారలను ఎండగడుతూ దాదాపు 7 వేలకు పైగా పద్యాలను ఆయన అందించారు. నేటికీ ఈ పద్యాలు లక్షల ప్రజల నోళ్లలో నానుతున్నాయి. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో రూ. 2 కోట్ల నిధులు మంజూరు చేసి కటారుపల్లిలోని వేమన ఆలయాన్ని పునఃనిర్మించారు. పర్యాటక శాఖ పరిధిలోకి చేర్చి పున్నమి రెస్టారెంట్, విడిది గృహాలను నిర్మించారు. ఆయన తర్వాత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సైతం వేమన ఆలయాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ఏటా జనవరి 19న వేమన జయంతిని అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు.
రేపటి నుంచి ఉత్సవాలు..
ఏటా ఉగాది పండుగ అయిన వారం రోజుల తర్వాత విశ్వకవి యోగి వేమన ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి ఆలయ పీఠాధిపతుల ఆధ్వర్యంలో మహాశక్తి పూజతో ఉత్సవాలు ప్రారంభించనున్నారు. రెండో రోజు సోమవారం రాత్రి బండ్ల మెరవణి, పానక పంద్యారం, రాత్రి 9గంటలకు పాటల కచేరి ఉంటుంది. 16న మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఉట్ల తిరునాల, రాత్రికి అగ్నిసేవ, 17న బుధవారం రాత్రి 8 గంటలకు స్వామి వారి గొడుగుల మెరవనితో ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాలకు ఉమ్మడి జిల్లా నుంచే కాక వైఎస్సార్, కర్నూలు, నెల్లూరు జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడులోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు. ఈ క్రమంలో భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా నిర్వాహకులు అన్ని చర్యలూ తీసుకున్నారు.
కటారుపల్లికి చేరాలంటే..
కదిరి నుంచి రాయచోటి ప్రధాన రహదారిపై కటారుపల్లిక్రాస్‌కు చేరుకుని గాండ్లపెంట మండలం కటారుపల్లిలోని వేమన ఆలయానికి చేరుకోవచ్చు. అలాగే రాయచోటి వైపు నుంచి వచ్చేవారు గాండ్లపెంట మీదుగా 4 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కటారుపల్లి క్రాస్‌లో దిగి అక్కడి నుంచి కిలోమీటరు దూరంలోని వేమన ఆలయానికి చేరుకోవచ్చు.
సాంఘిక దురాచారాలపై
గళమెత్తిన విశ్వకవి
రేపటి నుంచి 4 రోజుల పాటు
కటారుపల్లిలో వేమన ఉత్సవాలు

