
బాధితురాలితో మాట్లాడుతున్న ఎస్పీ మాధవరెడ్డి
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వివిధ సమస్యలపై 42 వినతులు అందాయి. ఎస్పీ మాధవరెడ్డి స్వయంగా వినతులు స్వీకరించి బాధితులతో మాట్లాడారు. అందిన వినతుల్లో ఎక్కువగా భూతగాదాలే ఉండడం గమనార్హం. ఇందులో పోలీసులు జోక్యం చేసుకుని అర్హులకు అన్యాయం చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పెనుకొండ సీఐ కరుణాకర్‌కు వ్యతిరేకంగా ఏకంగా మూడు ఫిర్యాదులు అందాయి. భూతగాదాల్లో ఆయన జోక్యం చేసుకుని తమను బెదిరిస్తున్నారంటూ ఎస్పీ ఎదుట బాధితులు వాపోయారు. రొద్దం మండలం పెద్దకోడిపల్లిలో ఎన్నో ఏళ్లుగా గ్రామకంఠం పరిధిలో ఉన్న రహదారిని అదే గ్రామానికి చెందిన కొందరు నకిలీ పట్టా సృష్టించి కబ్జా చేశారని, దీంతో తమ ఇళ్లకు రాకపోకలు సాగించేందుకు మార్గం లేకుండా ఇబ్బంది పడుతున్నామని ఆ గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంగా సీఐ కరుణాకర్ తమను స్టేషన్‌కు రప్పించుకుని చితకబాది, బెదిరించినట్లు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ నేపథ్యంలో సీఐ కరుణాకర్‌కు అనుకూలంగా అదే గ్రామానికి చెందిన మరో వర్గం వినతి పత్రం అందజేసింది. అలాగే కులాంతర వివాహం చేసుకున్న తమకు పెద్దల నుంచి ప్రాణహాని ఉందంటూ తలుపుల మండలం వేపమానుపేటకు చెందిన జ్యోత్స్న, హరీష్ ఎస్పీని ఆశ్రయించి, ఫిర్యాదు చేశారు. ఈ నెల 9న తాము ప్రేమ వివాహం చేసుకున్నట్లు వివరించారు. అయితే కులాలు వేరు కావడంతో అమ్మాయి తరఫు వారు పెళ్లికి అంగీకరించడం లేదని, దీంతో ధర్మవరంలో తలదాచుకుంటున్నట్లు వివరించారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ విష్ణు, దిశ డీఎస్పీ వరప్రసాద్, న్యాయ సలహాదారు సాయినాథ్‌రెడ్డి పాల్గొన్నారు.