● రెండు.....

- - Sakshi

● రెండు రోజుల క్రితం కదిరిలో వీధి కుక్క కరవడంతో తీవ్రంగా గాయపడిన ఓ చిన్నారి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. అంతకు మునుపు కొద్ది నెలల క్రితం పట్టణంలోని సైదాపురం, వైఎస్సార్‌ నగర్‌, అడపాల వీధుల్లో ఒకే రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో కుక్కల గుంపు స్వైర విహారం చేసి 17 మంది చిన్నారులతో పాటు మరో మహిళను సైతం తీవ్రంగా గాయపరిచింది.

● గాండ్లపెంటలో ఇటీవల ఓ పిచ్చికుక్క కరవడంతో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.

● బత్తలపల్లి మండలం యర్రాయపల్లిలో ఇటీవల కుక్కలు దాడి చేయడంతో తన మందలోని 23 గొర్రె పిల్లలు మృతి చెందాయని బాధితుడు బాలకొండ శివయ్య తెలిపారు.

● ధర్మవరంలోని శాంతినగర్‌లో ఆరుగురు చిన్నారులపై ఇటీవల వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.

● హిందూపురం మోడల్‌ కాలనీలో ఇటీవల వీధి కుక్కల దాడిలో ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు.

...ఇలా జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కలు చెలరేగిపోతున్నాయి. రోడ్డుపై కనిపించిన వారిపై దాడి చేస్తున్నాయి. బాధితుల్లో ఎక్కువగా చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

కదిరి: వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. రోడ్డుపైకొచ్చిన వారిపై దాడి చేస్తున్నాయి. దీంతో రోజురోజుకూ కుక్కకాటు బాధితుల సంఖ్య పెరుగుతోంది. చివరకు మూగజీవాలపై కూడా కుక్కలు దాడి చేస్తుండటంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతోంది. హైదరాబాద్‌లో ఇటీవల పట్టపగలు ఓ బాలుడిని వీధి కుక్కలు కరచి చంపేశాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా...ఆ దృశ్యాన్ని చూసిన వారి హృదయం తరుక్కుపోయింది. జిల్లాలోనూ ఇటీవల కుక్కకాటు సంఘటనలు పెరిగాయి. వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ, ఎదురు పడిన వారిపై దాడికి దిగుతున్నాయి. దీంతో జనం భయపడుతున్నారు. నడిచి వెళ్లే వారినే కాకుండా బైక్‌పై వేగంగా వెళ్తున్నా.. కుక్కలు వెంటబడి మరీ కరుస్తున్నాయి.

ఎండాకాలంలో ఎక్కువ కేసులు..

ఎండాకాలంలో వీధి కుక్కలకు ఆహారం, నీరు సరిగా లభించదని, దీనికి తోడు ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కుక్కల్లో ఇరిటేషన్‌ పెరిగి అవి దాడులు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. మిగతా మాసాల కంటే వేసవిలోనే కుక్కకాటు కేసులు ఎక్కువగా ఉంటాయంటున్నారు. ఈ రెండు మూడు నెలల కాలంలో కుక్కల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

శునకాలు పట్టేస్తున్నా... కు.నికి పాటేనా?

గత ప్రభుత్వం వీధి కుక్కల సమస్యను గాలికొదిలేయడంతో వాటి సంతతి బాగా పెరిగి పోయింది. వీటిని చంపడానికి నిబంధనలు ఒప్పుకోనందున, స్టెరిలైజేషన్‌ ఆపరేషన్‌లు చేసి వదిలేయాల్సి వస్తోంది. అలాగే పెంపుడు కుక్కల వివరాలను ఆయా మున్సిపాలిటీల్లో నమోదు చేయించాల్సి ఉంది. కానీ జిల్లాలోని ఏ మున్సిపాలిటీలోనూ కుక్కల నమోదు సరిగా జరగలేదు. అధికారుల వద్ద ఉన్న గణాంకాల ప్రకారం జిల్లాలోని మున్సిపాలిటీల్లో 1,547 పెంపుడు కుక్కలు, 32,960 వీధి కుక్కలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటికి తోడు మండలాల పరిఽధిలోని గ్రామాల్లోని కుక్కలను సైతం లెక్కిస్తే జిల్లా వ్యాప్తంగా సుమారు 1.60 లక్షల పెంపుడు, వీధి కుక్కలు ఉంటాయని అధికారులు అంటున్నారు. గడచిన మూడు నెలల్లో జిల్లా వ్యాప్తంగా 2,860 కుక్క కాటు కేసులు నమోదైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

స్టెరిలైజేషన్‌కు రూ.500 ఖర్చు..

ఒక్కో కుక్కకు కు.ని శస్త్ర చికిత్స చేయాలంటే రూ.500 ఖర్చు అవుతుంది. ఇప్పటికే మున్సిపాలిటీల్లో కుక్కలను పట్టుకొని కు.ని శస్త్ర చికిత్సలు చేయించినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ పట్టణ, మండల కేంద్రాల్లోని చికెన్‌ సెంటర్ల నిర్వాహకులు వ్యర్థాలను రోడ్డు పక్కన పడేయటంతో అక్కడికి పదుల సంఖ్యలో కుక్కలు చేరి పోట్లాడుకొని అడ్డొచ్చిన జనంపై దాడులకు దిగుతున్నాయని పలువురు అంటున్నారు. వ్యర్థాలు రోడ్డు పక్కన వేయకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

చెలరేగిపోతున్న వీధి కుక్కలు

రోడ్డుపైకి రావాలంటేనే

భయపడుతున్న జనం

బైక్‌పై వెళ్తున్నా వెంటబడి

దాడి చేస్తున్న వైనం

పశువులనూ వదిలి పెట్టని

గ్రామ సింహాలు

Read latest Sri Sathya Sai News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top