సర్వేతో సర్వ హక్కులు! | - | Sakshi
Sakshi News home page

సర్వేతో సర్వ హక్కులు!

Mar 28 2023 12:32 AM | Updated on Mar 28 2023 12:32 AM

- - Sakshi

పుట్టపర్తి అర్బన్‌: రాష్ట్రంలో వందేళ్లుగా భూముల సర్వే చేయకపోవడం వల్ల భూ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఏ భూమిలో ఎవరుంటున్నారో తెలియని పరిస్థితి. పట్టాలు భూములకు సంబంధించే కోర్టుల్లో వివాదాలు నడుస్తున్నాయి. ఇక గ్రామకంఠాల పరిస్థితి చెప్పనక్కరలేదు. దాదాపుగా గ్రామ కంఠం భూములన్నీ అసైన్డ్‌గా ఉండడంతో ఎలాంటి లావాదేవీలు జరగవు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్వమిత్వ పథకం ద్వారా ఈ భూములను సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సైతం ‘వైఎస్సార్‌ జగనన్న భూ హక్కు, భూ రక్ష’ పథకంలో భాగంగా రీ సర్వే చేయనున్న భూముల్లో గ్రామ కంఠాలను చేర్చింది.

ముమ్మరంగా సర్వే పనులు..

జిల్లాలో సమగ్ర రీసర్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 461 రెవెన్యూ గ్రామాల పరిధిలో 467 పంచాయతీలున్నాయి. ఇందులో ఇప్పటి వరకూ 411 గ్రామాల్లో అధికారులు డ్రోన్‌ ద్వారా సర్వే పూర్తి చేశారు. మరో 24 గ్రామాల్లో రీ సర్వే పనులు జరుగుతున్నాయి. ఇంకో 3 గ్రామాల్లో సర్వే చివరి దశగా భావించే 13 నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. దాదాపు 32 మంది మండల సర్వేయర్లు, 392 మంది విలేజ్‌ సర్వేయర్లు కలిపి 424 మంది పాల్గొంటున్నారు.

రీ సర్వేతో లాభాలెన్నో..

రీసర్వేలో భాగంగా గ్రామ కంఠం భూములను సర్వే చేస్తున్నారు. దీంతో సంబంధిత స్థలానికి పూర్తి హద్దులు, విస్తీర్ణం కచ్చితంగా తెలుస్తుంది. ముఖ్యంగా సర్వేతో భూ వివాదాలు, భూ తగాదాలు పూర్తిగా తొలగిపోతాయి. ఈ సర్వే పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు ప్రభుత్వం హక్కు కల్పిస్తూ ఆస్తి ధ్రువీకరణ పత్రం ఇస్తుంది. దీంతో ఈ భూములపై బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవడంతో పాటు క్రయ విక్రయాలకూ అవకాశం ఉంది.

3 గ్రామాల్లో

13 నోటిఫికేషన్‌ ఇచ్చిన గ్రామాలు..

గ్రామ కంఠం భూముల సర్వేకు సంబంధించి జిల్లాలోని మూడు గ్రామాల్లో అధికారులు 13 నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇందులో బత్తలపల్లి మండలం రాఘవంపల్లి, చెన్నరాయపట్నం, గాండ్లపెంట మండలం కమతంపల్లి, సోమందేపల్లి మండలం ఎస్‌.కొత్తపల్లి ఉన్నాయి. ఈ గ్రామాల్లో లబ్ధిదారులను గుర్తించి పట్టాలు మంజూరు చేస్తారు. ఇక తొలి విడతలో 24 గ్రామాల్లోని గ్రామకంఠాల సర్వే పూర్తి చేశారు. ఇందులో బత్తలపల్లి మండలం చెన్నరాయపట్నం, గాండ్లపెంట మండలం కమతంపల్లి, వదిరి మండలం అలంపూర్‌, కదిరికుంట్లపల్లి, సోమందేపల్లి మండలం ఎస్‌.కొత్తపల్లి, కనగానపల్లి మండలం ముత్తువకుంట్ల, ముదిగుబ్బ మండలం ఛాగాపురం, నక్కలగుట్టపల్లి, గాండ్లవాండ్లపల్లి, రామగిరి మండలం శేషాద్రిహట్రహళ్లి, మక్కినవారిపల్లి, తాడిమర్రి మండలం తిరుమలాపురం, నల్లచెరువు మండలం ములకలపల్లి, గోరంట్ల మండలం దేవులచెరువు, ఓబులాపురం, రాగిమేకలపల్లి, కాటేపల్లి, పెనుకొండ మండలం బొజ్జిరెడ్డిపల్లి, సీకేపల్లి మండలం ప్యాదిండి, అమడగూరు మండలం దాదెంవారిపల్లి, తలుపుల మండలం బండ్లపల్లి, ఓడీసీ మండలం నరసంబొట్లపల్లి ఉన్నాయి. త్వరలోనే ఆయా గ్రామాల్లోని గ్రామ కంఠం భూములు అనుభవంలో ఉన్న వారికి పట్టాలు మంజూరయ్యే అవకాశం ఉంది.

తాతలకాలం నాటి నుంచి భూమి సాగు

చేస్తున్నా హక్కులేదు. దశాబ్దాలుగా గ్రామకంఠం భూమిలో ఇల్లుకట్టుకుని

ఉంటున్నా అత్యవసరంలో అమ్ముకునే వీలులేదు. అసలు ఆస్తి తమదని చెప్పేందుకు ఎలాంటి ఆధారం లేదు. ఇలాంటి వారందరికీ ప్రభుత్వం హక్కులు కల్పిస్తోంది. ‘వైఎస్సార్‌ జగనన్న భూహక్కు – భూ రక్ష’ పథకంలో భాగంగా భూముల సమగ్ర రీసర్వే చేపట్టిన అధికారులు గ్రామకంఠం భూములను సర్వే చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే హక్కుదారులకు పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది.

జిల్లాలో ముమ్మరంగా రీసర్వే పనులు

ఇప్పటికే 24 గ్రామాల్లో సర్వే పూర్తి

మరో 411 రెవెన్యూ గ్రామాల్లో

డ్రోన్‌ సర్వే పూర్తి

గ్రామకంఠాలు ప్రత్యేకంగా

సర్వే చేస్తున్న అధికారులు

ప్రక్రియ పూర్తయితే హక్కుదారులకు పట్టాలు

గ్రామ కంఠాలన్నీ సర్వే చేస్తాం

రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామ కంఠం భూములను సర్వే చేస్తాం. ఇప్పటి వరకూ సర్వే పూర్తయిన 24 గ్రామాల్లో స్థానికులు పూర్తిగా సహకరించారు. మిగతా గ్రామాల్లోనూ సర్వే పూర్తయితే వివాదాలు, భూ తగాదాలు సమిసిపోతాయి. తొలి మొదటి విడత సర్వే దాదాపు పూర్తి కావచ్చింది. ప్రస్తుతం 3 గ్రామాల్లో 13 నోటిఫికేషన్‌ విడుదల చేశాం.

– రామక్రిష్ణ, ఏడీ, ల్యాండ్‌ అండ్‌ సర్వే

త్వరలో పట్టాలిస్తాం

గ్రామ కంఠం భూములను పూర్తి స్థాయిలో సర్వే చేస్తున్నాం. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రభుత్వం అర్హులకు పట్టాలు అందిస్తుంది. దీనివల్ల ఏళ్లుగా భూమిలో ఉన్న వారికి ఒక ఆధారం దొరుకుతుంది. పట్టాలు మంజూరైతే క్రయ విక్రయాలకూ అవకాశం ఉంటుంది.

– విజయ్‌కుమార్‌, జిల్లా పంచాయతీ అధికారి

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement