● డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
చిట్టమూరు: ఆర్టీసీ బస్సు ఇంజిన్లో మంటలు రావడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. వివరాలు.. నాయుడుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి మండలంలోని మల్లానికి బస్సు శనివారం బయల్దేరింది. చిట్టమూరు మండలం సరిహద్దు ప్రాంతానికి వచ్చేసరికి ఇంజిన్లో పొగలు, మంటలు రావడాన్ని డ్రైవర్ గుర్తించారు. దీంతో పక్కకు నిలిపేసి ప్రయాణికులను అప్రమత్తం చేసి బయటకు దింపారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. అనంతరం ప్రయాణికులను మరో బస్సులో మల్లానికి తరలించారు.
74 మందికి
ఉద్యోగావకాశాలు
నెల్లూరు రూరల్: కౌశల్ పోర్టల్లో నమోదు చేసుకున్న అభ్యర్థులకు ఉద్యోగావకాశాలను కల్పించేందుకు గానూ నిర్వహించిన ఎంపికల్లో 74 మంది అర్హత సాధించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో శుక్ర, శనివారాల్లో నిర్వహించిన ఎంపికలకు 114 మంది హాజరయ్యారు. వీరిలో ఎంపికై న 74 మందికి నియామక పత్రాలను అందజేశారు. భవిష్యత్తులో మరిన్ని సంస్థల ద్వారా ఎంపికలను నిర్వహించి ఉద్యోగావకాశాలను కల్పించనున్నామని స్వర్ణ గ్రామం.. స్వర్ణ వార్డు జిల్లా అధికారి వసుమతి తెలిపారు. జిల్లా సమన్వయకర్త హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.
డీసీపల్లిలో 741
పొగాకు బేళ్ల విక్రయం
మర్రిపాడు: డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో శనివారం 741 బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి సునీల్‌కుమార్ తెలిపారు. వేలానికి 799 బేళ్లు రాగా, 741 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు చెప్పారు. వేలంలో కిలో పొగాకు గరిష్టంగా రూ.250, కనిష్టంగా రూ.110, సగటున రూ.178.68 ధర పలికిందని వివరించారు. వేలంలో 11 కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.
హెచ్‌ఎంకు మెమో జారీ
మనుబోలు: స్థానిక జెడ్పీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు పాడైపోయిన చిక్కీలిచ్చిన ఘటనపై ప్రధానోపాధ్యాయుడు నరేంద్రనాఽథ్‌చౌదరికి మెమోను డీఈఓ బాలాజీరావు శనివారం జారీ చేశారు. ఘటనపై వివరణివ్వాలని ఆదేశించారు. బాలికోన్నత పాఠశాలలో తనిఖీలను గూడూరు డిప్యూటీ డీఈఓ సనత్‌కుమార్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ బృందం శుక్రవారం జరిపింది. ఈ సందర్భంగా కాలపరిమితి పూర్తయిన చిక్కీలను విద్యార్థులకు ఇస్తున్నారనే అంశాన్ని గుర్తించారు. ఈ తరుణంలో హెచ్‌ఎంపై చర్యలకు ఉపక్రమించారు.
ఎగసిపడుతున్న అలలు
వాకాడు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మండలంలోని తూపిలిపాళెం తీరంలో అలలు ఉవ్వెత్తున శనివారం ఎగసిపడ్డాయి. బలమైన ఈదురుగాలులతో భారీ అలలు తీరంవైపు దూసుకొస్తుండటంతో మత్స్యకార గ్రామాల్లో భయాందోళన నెలకొంది. సాధారణ స్థాయికంటే సుమారు 30 నుంచి 40 అడుగుల మేర సముద్రం ముందుకొచ్చిందని స్థానికులు చెప్పారు. అల్పపీడనం కారణంగా తీరప్రాంతంలో గాలుల తీవ్రత పెరగడంతో వేటకెళ్లేందుకు మత్స్యకారులు వెనుకడుగేస్తున్నారు.


