ఆశ కార్యకర్తల పోస్టుల భర్తీకి చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఆశ కార్యకర్తల పోస్టుల భర్తీకి చర్యలు

Sep 16 2026 11:56 PM | Updated on Sep 16 2026 11:56 PM

నెల్లూరు(అర్బన్‌): నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ పథకం కింద పీహెచ్‌సీలు, అర్బన్‌ పీహెచ్‌సీల్లో ఖాళీగా ఉన్న ఆశ కార్యకర్తల పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టామని డీఎంహెచ్‌ఓ సుజాత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరులోని రాజాగారివీధి, కోటమిట్ట, కావలిలోని వెంగళరావునగర్‌, గూడూరులోని మాలవ్యనగర్‌తోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని వరిగొండ, సంగం, మహ్మదాపురం, సౌత్‌మోపూరు, ముత్తుకూరు, ఇనమడుగు, వల్లిపేడు, చిట్టేడు, కొండాపురం, తుమ్మలపెంట, మైపాడు, వవ్వేరు, బుచ్చి, కోవూరుపల్లి, రేపూరు, చెన్నూరు, ఇస్కపల్లి పీహెచ్‌సీలలో ఒక్కో ఆశ కార్యకర్త పోస్టు ఖాళీగా ఉందన్నారు. అలాగే చేజర్ల, మనుబోలు, కలువాయి, పొదలకూరులో రెండేసి పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. 25 నుంచి 45 ఏళ్లలోపు మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఖాళీగా ఉన్న పీహెచ్‌సీ, అర్బన్‌ పీహెచ్‌సీల మెడికల్‌ ఆఫీసర్లకు ఈనెల 19లోపు దరఖాస్తులు అందజేయాలని కోరారు. దరఖాస్తు నమూనా, ఇతర వివరాల కోసం సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

నెల్లూరు(క్రైమ్‌): ఏం కష్టమొచ్చిందో తెలియదు కానీ గుర్తుతెలియని వ్యక్తి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం నెల్లూరు కరెంటాఫీసు రైల్వేగేటు సమీపంలో చోటుచేసుకుంది. నెల్లూరు వైపు వస్తున్న రైలు పట్టాలపై మృతదేహం ఛిద్రమై గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. మృతుడి వయసు సుమారు 50 నుంచి 55 ఏళ్ల మధ్య ఉంటుందని రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు సుమారు 5.3 అడుగుల ఎత్తు కలిగి ఉండి.. తెలుపు రంగుపై నల్ల గీతలు ఉన్న ఫుల్‌హ్యాండ్స్‌ చొక్కా, బూడిద రంగు జీన్స్‌ ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్‌.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

భార్యాభర్తలపై

టీడీపీ కార్యకర్తల దాడి

వెంకటాచలం: వైఎస్సార్‌సీపీకి చెందిన భార్యాభర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడిన ఘటన వెంకటాచలంలోని పోలీస్‌స్టేషన్‌ వద్ద బుధవారం జరిగింది. బాధితుల కథనం మేరకు.. వెంకటాచలం గ్రామానికి చెందిన నిజాం, జహీరా దంపతులు వైఎస్సార్‌సీపీలో కొనసాగుతున్నారు. వీరిపై సమీప బంధువు సిరాజ్‌ మంగళవారం దాడి చేశారు. ఈ విషయంపై బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విషయం మాట్లాడేందుకు నిజాం, జహీరా పోలీస్‌స్టేషన్‌ వద్దకు రాగా, టీడీపీ కార్యకర్తలు రమేష్‌, మహేష్‌, చరణ్‌, మరికొందరు కలిసి వారిద్దరితో వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. గాయపడిన జహీరాను వెంకటాచలం సీహెచ్‌సీకి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

విద్యుదాఘాతానికి వ్యక్తి బలి

సైదాపురం: విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని తురిమెర్ల గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. సైదాపురానికి చెందిన కాకాణి నాగరాజు (37) తురిమెర్ల గ్రామానికి చెందిన ప్రమీలను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు ఆడపిల్లలున్నారు. కొంతకాలం నుంచి అతను అత్తారింట్లో ఉంటున్నాడు. కూలీ పనులకు వెళ్తున్నాడు. మంగళవారం రాత్రి నాగరాజు ఆరు బయట ఫ్యాన్‌ పెట్టుకుని కుటుంబ సమేతంగా నిద్ర పోతున్నాడు. అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్లి నీరు తాగి తలుపులు వేస్తున్న సమయంలో ప్లగ్‌ బాక్స్‌ వైరు తెగిపోయింది. దానికి మరమ్మతులు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ పెద్ద మృతితో భార్యాబిడ్డలు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.

రోడ్డు దాటుతుండగా..

బైక్‌ ఢీకొని మహిళ మృతి

రాపూరు: రోడ్డు దాటుతున్న ఓ మహిళను మోటార్‌బైక్‌ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. రాపూరులోని పడమటి అగర్తకట్టకు చెందిన భూపతి శ్రీదేవి (53) ఇంటి నుంచి బజారుకు వచ్చేందుకు రోడ్డు దాటుతోంది. వెలుగోనుకు వెళ్తున్న బైక్‌ ఆమెను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని ఎస్సై తిరుమలరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement