ట్రేడ్‌ లైసెన్స్‌.. మాకొద్దు | - | Sakshi
Sakshi News home page

ట్రేడ్‌ లైసెన్స్‌.. మాకొద్దు

Sep 16 2026 11:56 PM | Updated on Sep 16 2026 11:56 PM

నెల్లూరు(బారకాసు): ట్రేడ్‌ లైసెన్స్‌.. దీని ద్వారా వ్యాపారాన్ని చట్టబద్ధంగా నిర్వహించడంతోపాటు ప్రజారోగ్య భద్రతకు సంబంధించిన నిబంధనలను పాటిస్తూ కార్యకలాపాలను సక్రమంగా కొనసాగించేందుకు కీలకం. అయితే నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. ప్రధాన రహదారులతోపాటు కాలనీల్లో ఇబ్బడిముబ్బడిగా వివిధ రకాల వ్యాపార, వాణిజ్య సముదాయాలు వెలుస్తున్నా.. ఆ స్థాయిలో ట్రేడ్‌ లైసెన్సుల జారీ జరగడం లేదనే విమర్శలున్నాయి. సంబంధిత వ్యాపారులు కూడా వాటిపై శ్రద్ధ చూపడం లేదని ఆరోపణలున్నాయి. ఫలితంగా కార్పొరేషన్‌కు ఏటా రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పన్నుల మదింపులో తేడాలు

లైసెన్సుల జారీ విషయం అటుంచితే.. విద్యాసంస్థలు, ఆస్పత్రులు, పరిశ్రమలు, హోటళ్లు, దుకాణాలకు సంబంధించిన పన్నుల మదింపులోనూ తేడాలు చాలా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కార్పొరేషన్‌కు ఏటా పెద్ద ఎత్తున రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడుతోంది. దీనికి ప్రధాన కారణం నగర పాలక సంస్థలోని కొంతమంది సిబ్బంది నిర్వాకంతోపాటు అవినీతి, అక్రమాలకు తలొగ్గడమేనన్న ఆరోపణలున్నాయి.

నిబంధనల ప్రకారం

వ్యాపార, వాణిజ్య సముదాయాలు, దుకాణాలు నడపాలంటే నిబంధనల ప్రకారం నగర పాలక సంస్థకు తప్పనిసరిగా ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధిత వ్యాపారులు నిర్ణయించిన రుసుమును చెల్లించాలి. అయితే నగర శివారు ప్రాంతాల్లోని వాణిజ్య, వ్యాపార సముదాయాలకు ట్రేడ్‌ లైసెన్సుల జారీపై ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ.. అనుకున్న మేర ఆదాయాన్ని సమకూర్చే లక్ష్యానికి కార్పొరేషన్‌ దూరంగా ఉంటోంది.

వ్యాపారం ఆధారంగా ఫీజు

దుకాణం విస్తీర్ణంతో సంబంధం లేకుండా చేస్తున్న వ్యాపారాన్ని బట్టి ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. కిరాణా దుకాణాలు, ఆస్పత్రులు, హోటళ్లు, విద్యాసంస్థలు ఇలా అనేక రకాల వాణిజ్య, వ్యాపార సంస్థలకు సంబంధించి వాటి స్థాయిని బట్టి రూ.300 నుంచి రూ.40 వేల వరకు ఫీజు కట్టాలి. వ్యాపారస్తులు కార్పొరేషన్‌ నుంచి ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకుని ఏటా నిర్దేశించిన ఫీజు చెల్లించాల్సి ఉండగా.. చాలామంది నిర్వాహకులు లైసెన్సులు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఏటా ఏప్రిల్లో దుకాణాల నిర్వాహకులు తప్పనిసరిగా ట్రేడ్‌ లైసెన్స్‌ను పునరుద్ధరించుకోవాలని కార్పొరేషన్‌ అధికారులు చెబుతున్నా.. ఆచరణలో మాత్రం పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు.

విలీన పంచాయతీల్లో..

నగరపాలక సంస్థ పరిధిలోని విలీన గ్రామ పంచాయతీల్లో పెద్ద ఎత్తున దుకాణాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు పెరుగుతూనే ఉన్నాయి. గతంలో ఉన్న వాటికి రెట్టింపు సంఖ్యలో వెలిశాయి. అయితే చాలా వాటికి ట్రేడ్‌ లైసెన్సులు పొందకుండానే వ్యాపార సముదాయాలను నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎన్‌ఎంసీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కార్పొరేషన్‌ పరిధిలోని ప్రతి వ్యాపార, వాణిజ్య సముదాయాన్ని గుర్తించి ట్రేడ్‌ లైసెన్సులు ఉన్నాయా లేదా పరిశీలించాల్సిన అవసరం ఉంది. లైసెన్సులు లేని వాటికి నిబంధనల ప్రకారం జారీ చేయడంతో పాటు.. ఏటా వాటిని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలి.

ఎన్‌ఎంసీ పరిధిలో ఇదీ పరిస్థితి

మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వ్యాపార, వాణిజ్య సముదాయాలకు సంబంధించి 19 వేల ట్రేడ్‌ లైసెన్సులున్నాయి. వీటి నుంచి బకాయిలతో కలిపి రూ.3 కోట్లు వసూలు కావాల్సి ఉంది. అయితే 2026 – 27 సంవత్సరానికి ఇటీవల వరకు రూ.2.90 కోట్లు వసూలైంది. ఇవి అధికారిక గణాంకాలు. వాస్తవానికి కార్పొరేషన్‌కు ఇంతకు రెండింతలుగా ఆదాయం వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. దీంతోపాటు వాణిజ్య, వ్యాపార సముదాయాలు కూడా అధిక సంఖ్యలో పెరిగిపోతున్నాయి. ఆయా వ్యాపార దుకాణాలు దాదాపు 25 వేలకు పైగా ఉండొచ్చని అంచనా. పూర్తిస్థాయిలో గుర్తించగలిగితే.. లైసెన్సులు లేనివి వేల సంఖ్యలో బయటపడే అవకాశం ఉంది. వాటన్నింటికీ జారీ చేసినట్లయితే ఎన్‌ఎంసీకి ప్రస్తుతం వస్తున్న ఆదాయం రెండింతలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా బ్యాంకుల్లో రుణం తీసుకున్న వారు మినహా మిగతా వ్యాపార సముదాయాలకు సంబంధించిన వారు ట్రేడ్‌ లైసెన్సులు పొందేందుకు ఆసక్తి చూపడం లేదనే విమర్శలున్నాయి.

వాణిజ్య సముదాయాల్లో లైసెన్సులు లేనివే అధికం

ఏటా పునరుద్ధరణపై నిర్లక్ష్యం

రూ.కోట్లలో కార్పొరేషన్‌ ఆదాయానికి నష్టం

సిబ్బంది చేతివాటంపై ఆరోపణలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement