పోలీసులు అరెస్ట్‌ చేస్తారనే భయంతో.. | - | Sakshi
Sakshi News home page

పోలీసులు అరెస్ట్‌ చేస్తారనే భయంతో..

Sep 16 2026 11:56 PM | Updated on Sep 16 2026 11:56 PM

జీజీహెచ్‌లో వ్యక్తి బలవన్మరణం

నెల్లూరు(క్రైమ్‌): పోలీసులు అరెస్ట్‌ చేస్తారనే భయంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నెల్లూరు జీజీహెచ్‌లో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సంగం మండలం గాంధీ గిరిజన సంఘానికి చెందిన చెంచయ్య (52), కామేశ్వరమ్మ దంపతులకు చెంచుకృష్ణ, శ్రావణి సంతానం. కాగా ఇద్దరూ గ్రామంలోనే ఉంటున్నారు. చెంచయ్య ఏడాదిగా నెల్లూరు రామ్మూర్తి నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ భార్యతో కలిసి అక్కడే ఉంటున్నాడు. అతడికి మద్యం అలవాటు ఉంది. తాగిన సమయంలో కుమారుడికి ఫోన్‌ చేసి తరచూ గొడవపడుతుండేవాడు. ఆరురోజుల క్రితం శ్రావణి తన తల్లికి ఫోన్‌ చేసి చెంచుకృష్ణ తనను కొట్టాడని చెప్పింది. దీంతో ఆగ్రహించిన చెంచయ్య గ్రామానికి వెళ్లి కుమారుడిపై కత్తితో దాడికి యత్నించగా అడ్డుకోబోయిన కోడలిపై దాడి చేశాడు. ఈ ఘటనపై సంగం పోలీస్‌స్టేషన్‌లో చెంచయ్యపై కేసు నమోదైంది. దీంతో భయాందోళనకు గురైన అతను పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఈనెల 11వ తేదీన చికిత్స నిమిత్తం నెల్లూరు జీజీహెచ్‌లో చేర్పించారు. సంగం పోలీసులు ఆస్పత్రిలో విచారించి వెళ్లారు. ఈ నేపథ్యంలో తనను అరెస్ట్‌ చేస్తారనే భయంతో చెంచయ్య ఆస్పత్రి మరుగుదొడ్డిలో పైపునకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పెద్దాస్పత్రిలో కలకలం

నెల్లూరు(అర్బన్‌): పెద్దాస్పత్రిలో రోగుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. మూడు రోజుల క్రితం చిల్లకూరు మండలానికి చెందిన కిడ్నీ రోగి మరుగుదొడ్డిలో కిటికీకి లుంగీ బిగించి ఉరేసుకున్న ఘటన మరువక ముందే బుధవారం చెంచయ్య బలవన్మరణానికి పాల్పడ్డాడు. గతంలో ఓ వ్యక్తి ఐపీ బిల్డింగ్‌లోని మూడో అంతస్తు నుంచి దూకి మృతిచెందాడు. అంతకుముందు డీఎస్‌ఆర్‌ బ్లాక్‌లో మరో సైకాలజికల్‌గా ఇబ్బంది ఎదుర్కొంటున్న వ్యక్తి అద్దం పగులగొట్టుకుని దూకి చనిపోయాడు. మరణాలు ఆగాలంటే ఆస్పత్రిలో చేరిన రోగులకు డాక్టర్లు కౌన్సెలింగ్‌ ఇవ్వాల్సి ఉంది. అయితే అలాంటి వ్యవస్థ పెద్దాస్పత్రిలో లేకపోవడంతో ఇలాంటి దురదృష్ట ఘటనలు జరుగుతున్నాయని ప్రజలు భావిస్తున్నారు. ఇకనైనా ఇలాంటి ఆత్మహత్యల్ని కట్టడి చేసేలా అధికారులు తగు చర్యలు చేపట్టాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement