నెల్లూరు(పొగతోట): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల (ఎఫ్‌ఏ) తొలగింపు, కొత్త నియామకాల జాప్యం వివాదాస్పదంగా మారింది. పాత ఎఫ్‌ఏలను తొలగించి కొత్తవారిని నియమించేందుకు ప్రయత్నాలు జరిగినప్పటికీ.. వారి పేర్లు ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవడంతో రెండేళ్లుగా వేతనాలు లేకుండా పనిచేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనుల నిర్వహణకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని తెలుస్తోంది.
400 గ్రామ పంచాయతీల్లో..
జిల్లాలో 700 గ్రామ పంచాయతీలు, 2.78 లక్షల జాబ్‌కార్డులున్నాయి. 4.58 లక్షల మంది ఉపాధి శ్రామికులున్నారు. వీరిలో 3.48 లక్షల మంది యాక్టివ్ శ్రామికులుగా ఉన్నారు. సుమారు 400 గ్రామ పంచాయతీల్లో ఎఫ్‌ఏలు లేరని సమాచారం. ఆయా పంచాయతీల్లో మేట్లను ఇన్‌చార్జ్‌లుగా నియమించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. దీంతో ఉపాధి పనులకు హాజరయ్యే శ్రామికుల సంఖ్య తగ్గిపోయిందని అధికారులు చెబుతున్నారు. గతేడాది ఇదే సీజన్‌లో రోజుకు 80 వేల నుంచి 85 వేల మంది పనులకు హాజరయ్యేవారు. ప్రస్తుతం 40 వేల నుంచి 45 వేల మంది మాత్రమే హాజరవుతున్నట్లు సమాచారం. శ్రామికుల సంఖ్యను పెంపుపై అధికారులు దృష్టి సారించారు. లక్ష్యాలను సాధించని సిబ్బందిని ఇతర జిల్లాలకు బదిలీ చేస్తామని, ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు.
తొలగింపుపై విమర్శలు
గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న పలువురు ఎఫ్‌ఏలను వివిధ కారణాలతో తొలగించారని ఆరోపణలున్నాయి. రాజకీయ కారణాలతో టీడీపీ నాయకులు తమకు అనుకూలంగా వ్యవహరించే వారిని కొత్తగా నియమించేందుకు ప్రయత్నాలు చేసినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి ఆరోపణలు లేని కొందరిని గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే కారణంతో తొలగించారని పలువురు పేర్కొంటున్నారు. తొలగింపుపై కొందరు కోర్టును ఆశ్రయించగా.. తిరిగి ఎఫ్‌ఏలుగా కొనసాగించాలని ఆదేశాలు వచ్చినప్పటికీ వాటిని అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కొత్త ఎఫ్‌ఏల నియామకానికి సంబంధించిన వేలాది దరఖాస్తులు రాష్ట్ర అధికారులకు చేరినప్పటికీ.. నిబంధనల కారణంగా ప్రక్రియలో జాప్యం ఏర్పడిందని తెలుస్తోంది.
ఫొటోల అప్‌లోడ్‌లో జాప్యం
ఉపాధి పనులకు హాజరయ్యే శ్రామికుల హాజరును నమోదు చేసేందుకు ఫొటోలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక గ్రామ పంచాయతీలో 150 మంది శ్రామికులు పనులకు హాజరైతే.. అందరి ఫొటోలను రోజుకు రెండుసార్లు తీసి అప్‌లోడ్ చేయడం ఎఫ్‌ఏలకు కష్టతరంగా మారుతోంది. నిబంధనల ప్రకారం రెండుసార్లు ఫొటోలు అప్‌లోడ్ చేయకపోతే శ్రామికులకు వేతనాల జమలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఎఫ్‌ఏలు రోజుకు ఒక్కసారి మాత్రమే ఫొటోలు అప్‌లోడ్ చేస్తున్నారని సమాచారం. ఈ ప్రక్రియకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతోందని చెబుతున్నారు. రెండుసార్లు ఫొటోలు అప్‌లోడ్ చేయాలన్న నిబంధన పూర్తిస్థాయిలో అమలైతే మరింత జాప్యం జరిగి, శ్రామికులందరికీ సకాలంలో వేతనాలు మంజూరు కావడంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మేట్లకు పారితోషికం కరువు
ఫొటోల అప్‌లోడ్ ప్రక్రియను సులభతరం చేసేందుకు 30 మంది శ్రామికులకు ఒక మేట్‌ను నియమించే విధానం అమల్లోకి తెచ్చారు. మేట్లు తమ స్మార్ట్‌ఫోన్లను రిజిస్ట్రేషన్ చేయించుకుని శ్రామికుల హాజరు ఫొటోలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సేవలకు పారితోషికం లేకపోవడంతో మేట్లు మొబైల్ రిజిస్ట్రేషన్‌కు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. గతంలో 30 మంది శ్రామికులు పనులకు హాజరైతే మేట్‌కు రూ.60 చెల్లించేవారు. ప్రస్తుతం ఆ విధానం లేకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని సమాచారం. మేట్ల మొబైల్ రిజిస్ట్రేషన్ పూర్తయిన గ్రామ పంచాయతీల్లో ఫొటోల అప్‌లోడ్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తికాని పంచాయతీల్లోనే సమస్యలు అధికంగా ఉన్నాయని పేర్కొంటున్నారు.
పాత వారిని తొలగించి..
కొత్తవారికి అవకాశం
రెండేళ్లుగా వేతనాల్లేవు
మేట్లకు పారితోషికం లేదు
పనుల నిర్వహణలో ఇబ్బందులు


