విలువైన భూముల ఆక్రమణ
సురే దశరథరామిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు మేత పోరంబోకుతోపాటు చెరువు స్థలాలు, వాగు పోరంబోకు భూములను కూడా ఆక్రమించి సాగు చేస్తున్నారు. దాదాపు రూ.1.50 కోట్ల విలువైన భూముల్లో సాగు చేస్తున్నారు. మేత పోరంబోకు భూమి విషయంలో ప్రశ్నిస్తే దాడులు చేయడమే కాకుండా తప్పుడు కేసులు పెడుతున్నారు. దీంతో గ్రామస్తులు భయపడుతున్నారు.
– గువ్వల శ్రీధర్‌రెడ్డి
కావలి: జలదంకి మండలం చోడవరం గ్రామంలో పశువుల మేత కోసం కేటాయించిన పోరంబోకు భూమి ఆక్రమణకు గురైంది. సుమారు రూ.4 కోట్ల విలువైన భూమి కబ్జాకు గురవడంతో పశువులను మేపేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చోడవరం ఏర్పడిన సమయంలో గ్రామంలోని పశువులు అన్ని కాలాల్లో మేత మేసేందుకు సర్వే నంబర్ 282లో 40 ఎకరాలకు పైగా భూమిని పోరంబోకు భూమిగా వదిలివేశారు. వర్షాలు కురిసిన సమయంలో వ్యవసాయ పనులు, పంటల సాగు కొనసాగుతున్నప్పుడు గ్రామంలోని పశువులు ఈ భూమిలోకి వెళ్లి మేత మేసేవి.
జామాయిల్ సాగు..
కొన్ని సంవత్సరాలుగా అదే గ్రామానికి చెందిన సురే దశరథరామిరెడ్డి కుటుంబం సర్వే నంబర్ 282లోని సుమారు 10 ఎకరాలకు పైగా భూమిని ఆక్రమించి జామాయిల్ సాగు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అతడిని ఆసరాగా చేసుకుని మరికొందరు రైతులు కూడా మేత పోరంబోకు భూముల్లో జామాయిల్, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. దీంతో గ్రామంలోని పశువులకు మేత లేకుండా పోయింది. తమ పశువులను మేత పోరంబోకు భూముల్లోకి తీసుకెళ్తే సురే దశరథరామిరెడ్డి, అతని అనుచరులు దాడులకు పాల్పడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.
ఆక్రమణలతో గ్రామంలో అశాంతి
దశరథరామిరెడ్డి కుటుంబం టీడీపీలో ఉంది. ప్రభుత్వ భూములను ఆక్రమించడమే కాకుండా ప్రైవేట్ భూములపై కూడా కన్నేస్తున్నారని స్థానికులు అంటున్నారు. తమను ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతూ గ్రామంలో అశాంతి పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి దశరథరామిరెడ్డి ఆక్రమించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భూములపై విచారణ జరిపి మేత పోరంబోకు భూమిని కబ్జాల నుంచి విడిపించాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని గతంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకోకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.
రూ.4 కోట్ల విలువైన మేత
పోరంబోకు భూమి కబ్జా
పశువులకు మేత లేక
రైతుల ఇబ్బందులు
ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారని గ్రామస్తుల ఆరోపణలు


