● డీఎంహెచ్‌ఓ సుజాత
● జిల్లా వ్యాప్తంగా చిన్నారులకు చుక్కల మందు
నెల్లూరు(అర్బన్): పోలియో రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని డీఎంహెచ్‌ఓ సుజాత అన్నారు. పల్స్ పోలియో 2026 కార్యక్రమాన్ని ఆదివారం నెల్లూరులోని శెట్టిగుంటరోడ్డులో ఉన్న వైవీఎం మున్సిపల్ పాఠశాలలో ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్‌తో కలిసి డీఎంహెచ్‌ఓ ప్రారంభించారు. 5 ఏళ్లలోపు వయసున్న పలువురు చిన్నారులకు చుక్కల మందు వేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ 2,67,750 మంది చిన్నారులకు రెండు చుక్కల చొప్పున ఓరల్ పోలియో వ్యాక్సిన్ వేస్తున్నామన్నారు. వీరికోసం 1,620 పోలియో బూత్‌లు ఏర్పాటు చేశామన్నారు. హైరిస్క్ ప్రాంతాల్లో 83 మొబైల్ బూత్‌లను, ప్రయాణాల్లో ఉన్న పిల్లలకు చుక్కలు వేసేందుకు 88 ట్రాన్సిట్ బూత్‌లు పెట్టామన్నారు. తొలిరోజు మిస్సయిన పిల్లల కోసం సోమ, మంగళ వారాల్లో ఇంటింటి సర్వే ద్వారా చుక్కల మందు వైద్యసిబ్బంది వేస్తారన్నారు. కార్యక్రమంలో డెమో అధికారి కనకరత్నం, స్టాటిస్టికల్ అధికారి సహన, మెడికల్ ఆఫీసర్లు డా.ధనలక్ష్మి, డా.మౌనిక, డా.కార్తీక్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ విజయలక్ష్మి, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
తొలిరోజు 95.05 శాతం మందికి..
తొలిరోజు 2,54,510 పిల్లలకు వైద్యసిబ్బంది చుక్కల మందు వేశారు. 95.05 శాతం నమోదైంది. డీఎంహెచ్‌ఓ సుజాత మాట్లాడుతూ హైరిస్క్ ప్రాంతాలైన గిరిజన కాలనీలు, ఇటుకబట్టీలు, తోటల్లో పనిచేసే చోట తల్లిదండ్రులతో ఉండే పిల్లలను గుర్తించి చుక్కల మందు వేసి 100 శాతం విజయాన్ని అందుకుంటామన్నారు. సహకరించిన అంగన్‌వాడీ, ఆర్‌ఎంపీ, పీఎంపీలతోపాటు స్వచ్ఛంద సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు.
గ్రావెల్ టిప్పర్ల ఇష్టారాజ్యం
● త్రుటిలో తప్పిన ప్రమాదం
● చర్యలు తీసుకోవాలని జనం డిమాండ్
కావలి: గ్రావెల్ టిప్పర్లు ఇష్టారాజ్యం తిరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం కావలి నుంచి బ్రాహ్మణక్రాక, కృష్ణాపాడు మీదుగా నెల్లూరుకు ఆర్టీసీ బస్సు బయలుదేరింది. దారిలో కావలి విట్స్ కళాశాల వద్ద ఉన్న స్టాప్‌లో ఆగి ప్రయాణికులను ఎక్కించుకుంటోంది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న సీతారామ లారీ సర్వీస్‌కు చెందిన టిప్పర్ బస్సును రాసుకుంటూ వెళ్లే పరిస్థితి లేక ఆగిపోయింది. ఈ ఘటనలో బస్సు కుడివైపు భాగం స్వల్పంగా దెబ్బతింది. అయితే ప్రమాదం పెద్దది కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కసారిగా జరిగిన ఘటనతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
టిప్పర్ల రాకపోకలపై ఆందోళన
పట్టణ పరిసర ప్రాంతాల నుంచి అక్రమ గ్రావెల్ తరలింపులో భాగంగా టిప్పర్లు పగలు, రాత్రి తేడా లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్నాయి. దీంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో భారీ వాహనాల రాకపోకలపై అధికారులు దృష్టి సారించాలని, ముఖ్యంగా పగటి సమయంలో టిప్పర్లు తిరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


