తూపిలిపాళెంలో తమిళ బోట్ల హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

తూపిలిపాళెంలో తమిళ బోట్ల హల్‌చల్‌

Jun 29 2026 5:34 AM | Updated on Jun 29 2026 5:34 AM

మా బతుకులు ఇంతేనా?

స్థానిక మత్స్యకారుల ఆవేదన

వాకాడు: కొన్నేళ్లుగా తమిళ జాలర్లు హద్దులు దాటి మత్స్య దోపిడీ, దాడులకు పాల్పడుతున్నా శాశ్వత చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని స్థానిక మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. ఆదివారం తమిళ జాలర్ల బోట్లు వాకాడు మండలం తూపిలిపాళెం తీరంలో హల్‌చల్‌ చేశాయి. స్థానిక మత్స్యకారుల వివరాల మేరకు.. ఇటీవల జువ్వలదిన్నె వద్ద తమిళ జాలర్లు బోట్లను జిల్లా మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకున్నారు. అయితే తిరిగి వాటిని వదిలేయడంతో తమిళ జాలర్లు జిల్లా తీరం వెంబడి తమ అక్రమ వేటకు మళ్లీ స్పీడు పెంచారు. ఈ క్రమంలోనే 25 రోజులుగా ఆంధ్రా సరిహద్దుల్లో నిబంధనలకు విరుద్ధంగా తీరానికి అతి దగ్గర్లో వేట చేసి మత్స్యసంపదను దోచుకుపోవడం జరుగుతోంది. స్పీడు బోట్లతో సముద్రంపై హద్దులు దాటి తమ పరిధిలోకి చొచ్చుకొచ్చి అక్రమంగా వేట చేసి తమకేమీ మిగల్చకుండా విలువైన మత్స్యసంపదను దోచుకుపోతున్నారని జిల్లా మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

52 స్పీడు బోట్లతో..

నాలుగు వారాల వ్యవధిలోనే చిల్లకూరు, కోట, వాకాడు, తడ, సూళ్లూరుపేట మండల పరిధిలోని సముద్రంలో సుమారు 52 స్పీడు బోట్లు ఒక్కసారిగా పరిధి దాటి వందల టన్నుల మత్స్యసంపదను దోచుకుపోవడం జరిగింది. దీనిని గమనించిన స్థానిక మత్స్యకారులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై రాళ్లదాడికి దిగడంతో తప్పించుకుని ఒడ్డుకు చేరుకున్నారు. పొరుగు రాష్ట్రాల స్పీడు బోట్ల దందాకు ఎవరూ అడ్డుకట్ట వేయలేకపోతున్నారని, మా బతుకులు ఇంతేనా అని మత్స్యకారులు బాధపడుతున్నారు. రెండు నెలల వేట విరామం కాలం తర్వాత అరకొరగా లభిస్తున్న మత్స్య సంపదతో జీవనం సాగిస్తున్న తమకు పొరుగు జాలర్లు ఒక్క చేపను కూడా దొరకనివ్వకుండా నోట్లో మట్టి కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా స్పీడు బోట్లు 8 నాటికల్‌ మైళ్ల దూరం పైన సముద్రంలో వేట చేయాలి. అలా కాకుండా నిబంధనలు అతిక్రమించి 2 నాటికల్‌ మైళ్ల దూరంలోనే వేట చేస్తున్నాయి. తాము ఏడాది మొత్తం పస్తులతో అలమటించినా.. ఎవరూ పట్టించుకోరా అని స్థానికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement