● హుండీ నిర్వాహకుల బలవంతపు వసూళ్లు
●పట్టించుకోని అధికారులు
వెంకటాచలం: దక్షిణాది రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన కసుమూరు మస్తాన్‌వలీ దర్గాను దర్శించుకునే భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. హుండీల్లో నగదును వేయాలని హుండీ కాంట్రాక్టర్లు బహిరంగంగా డిమాండ్ చేస్తున్నా, అధికారులు అడ్డుకట్టేయకపోవడంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. నెల్లూరు నగరంలోని బారాషహీద్ దర్గా వద్ద నిర్వహించే రొట్టెల పండగకు వచ్చే భక్తుల్లో 50 శాతానికిపైగా ఇక్కడి దర్గాను దర్శించుకోవడం ఆనవాయతీగా వస్తోంది. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. దర్గాలో అదనపు హుండీలను కాంట్రాక్టర్లు ఏర్పాటు చేసి, అందులో నగదును వేయాలని చెప్పడంతో భక్తులు ఆదివారం గొడవకు దిగారు. తమకు ఇష్టముంటే వేస్తామని.. మీరు బలవంతంగా సమర్పించాలని చెప్పడమేమిటని ప్రశ్నించారు. గొడవతో అర్ధగంటపాటు ఎవర్నీ దర్శనం చేసుకోనీయకుండా నిలిపేశారు.
మూడు రోజులుగా ఇదే తంతు..
హుండీ నిర్వాహకులు బలవంతపు వసూళ్లకు మూడు రోజులుగా పాల్పడుతున్నా.. రెవెన్యూ, పోలీస్ అధికారులు పట్టించుకోకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. సాధారణ రోజుల్లో దర్గాలో రెండు హుండీలే ఉంటాయి. భక్తులు తమకు తోచినంత నగదును అందులో సమర్పిస్తారు. అయితే గంధ మహోత్సవం, రొట్టెల పండగ సందర్భాల్లో దర్గా ప్రాంగణంలో అదనపు హుండీలను కాంట్రాక్టర్లు ఏర్పాటు చేసి, ప్రతి చోటా సిబ్బందితో బలవంతపు వసూళ్లకు పాల్పడుతుండటం వివాదాస్పదమవుతోంది.


