ఇదీ పరిస్థితి.. | - | Sakshi
Sakshi News home page

ఇదీ పరిస్థితి..

Jun 4 2026 5:28 AM | Updated on Jun 4 2026 5:28 AM

నెల్లూరు (టౌన్‌): తల్లికి వందనం పథకానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని గత ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా తమ ప్రభుత్వం కొలువుదీరాక దీన్ని విస్మరించారు. 2024లోనే దీన్ని అమలు చేయాల్సి ఉన్నా, రకరకాల కారణాలు చెప్పి ఎగనామం పెట్టారు. ఆ తర్వాతి ఏడాది రకరకాల నిబంధనలను పెట్టి వేలాది మంది పేద విద్యార్థులను ఈ పథకానికి దూరం చేశారు.

ఒక్కరికే జమ

జిల్లాలోని చాలా కుటుంబాల్లో ఇద్దరు పిల్లలు చదువుతున్నా, ఒక్కరికి మాత్రమే నిధులు జమయ్యాయి. రూ.13 వేలనే తల్లి ఖాతాలో వేసి చేతులు దులుపుకొన్నారు. ఫలితంగా పేద స్టూడెంట్స్‌కు అన్యాయం జరిగింది. ఆయా స్కూళ్లలో చిన్న పనులున్నా, డబ్బుల్లేక వాటిని అలానే వదిలేసిన దుస్థితి నెలకొంది. అదే గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో అర్హులందరికీ పథకాన్ని వర్తింపజేశారు.

కుట్రలు తెరపైకి..

అధికారంలోకి వచ్చాక లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే కుట్రను టీడీపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. నెలకు 300 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగం.. సొంతంగా కారు.. కుటుంబ ఆదాయం.. పట్టణాల్లో రూ.12 వేలు.. పల్లెల్లో రూ.పది వేల నెల ఆదాయం.. మాగాణి మూడు, మెట్ట పదెకరాలు మించకూడదని.. పట్టణాల్లో వెయ్యి చదరపు అడుగుల స్థలం ఉండకూడదని.. ఆదాయ పన్ను చెల్లించినా.. పాఠశాలల్లో 75 శాతం హాజరు తగ్గినా, ఈ పథకం వర్తించదంటూ ఎవరికీ అంతుపట్టని రీతిలో కొత్త రూల్స్‌ను తీసుకొచ్చి, ఎంతో మంది తల్లులకు అంతులేని ఆవేదనను మిగిల్చింది.

ఒక్కొక్కరికీ ఒక్కో తరహాలో..

ఒక్కో విద్యార్థి తల్లి ఖాతాలో రూ.15 వేల చొప్పున జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం, ఆ మేరకూ వేయలేదు. రూ.ఏడు వేల నుంచి రూ.13 వేల వరకు వేశారు. అధిక శాతం మందికి రూ.పది వేల్లోపే జమ కావడం గమనార్హం. ఇందులోనూ రూ.రెండు వేలకు కోత విధించడంతో ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నించింది. ఈ మొత్తాన్ని స్కూల్‌ మెయింటెనెన్స్‌కు వినియోగిస్తామని చెప్పినా, ఎక్కడా ఇవ్వలేదు. వీటిని తమ సొంత ఖాతాలకు మళ్లించారనే ఆరోపణలూ లేకపోలేదు. మరోవైపు పాఠశాలలకు ఏటా ఇచ్చే సాధారణ గ్రాంట్‌నూ పూర్తిస్థాయిలో అందించలేదు. ఫలితంగా హెడ్‌మాస్టర్లే కొంత మేర ఖర్చు చేయాల్సి వస్తోంది. నిధుల్లేక.. చిన్న మరమ్మతులు సైతం నోచుకోక భవనాలు శిథిలావస్థకు చేరుకొని, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

తల్లికి వందనం పేరిట ఒక్కో బిడ్డకు రూ.15 వేలిస్తామని చంద్రబాబు హామీ

ఖాతాలో రూ.13 వేలే జమ

మిగిలిన మొత్తం స్కూల్‌

మెయింటెనెన్స్‌కు అంటూ సాకు

ఆ నిధులనూ పాఠశాలలకు ఇవ్వని కూటమి ప్రభుత్వం

స్కీమ్‌ కోసం సచివాలయాల

చుట్టూ ప్రదక్షిణలు

రకరకాల కొర్రీలతో

పలువురికి ఎగనామం

జిల్లాలో 3221 ప్రభుత్వ, 1050 ప్రైవేట్‌ పాఠశాలలున్నాయి. ఇందులో దాదాపు 4.02 లక్షల మంది చదువుతున్నారు. అదే విధంగా 185 ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో 60 వేల మంది విద్యనభ్యసిస్తున్నారు. తల్లికి వందనం పథకాన్ని వీరందరికీ వర్తింపజేస్తామని గత ఎన్నికలకు ముందు టీడీపీ హామీ ఇచ్చింది. దీనికి గానూ సూపర్‌ సిక్స్‌ అంటూ కరపత్రాన్ని ఆర్భాటంగా రూపొందించి వాడవాడలా అందజేసింది.

Advertisement
 
Advertisement
Advertisement