ఆటో బోల్తా పడి డ్రైవర్‌ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా పడి డ్రైవర్‌ దుర్మరణం

Jun 4 2026 5:28 AM | Updated on Jun 4 2026 5:28 AM

సంగం: మండలంలోని గాంధీజనసంఘం సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం ఆటో అదుపుతప్పి బోల్తాపడటంతో డ్రైవర్‌ మృతి చెందారు. వివరాలు.. గూడూరు రూరల్‌ మండలం అయ్యవారిపాళేనికి చెందిన రాము(44) కడప నుంచి నెల్లూరుకు ఆటోలో బయల్దేరారు. గాంధీజనసంఘం సమీపంలోకి చేరుకోగానే ఆటో అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఘటనలో రాము మృతి చెందగా, ఆటోలోని మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. సంగం సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సై భోజ్యానాయక్‌ ఘటన స్థలానికి చేరుకొని ప్రమాద తీరును పరిశీలించారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

కావలి కాలువలో

యువకుడి గల్లంతు

దగదర్తి: ేస్నహితులతో కలిసి సరదాగా ఈతకెళ్లిన ఓ యువకుడు గల్లంతైన ఘటన మండలంలోని చెన్నూరు సమీపంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు.. కావలికి చెందిన బొడ్డు కార్తీక్‌ (32)కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. దగదర్తిలోని తన చిన్నమ్మ ఇంటికి సరదాగా గడిపేందుకు ఆయన వచ్చారు. తన ఇద్దరు స్నేహితులతో కలిసి కావలి కాలువలోకి ఈతకు బుధవారం సాయంత్రం వెళ్లారు. కాలువలో దిగి ఈత కొడుతున్న సమయంలో ప్రవాహానికి కార్తీక్‌ గల్లంతయ్యారు. గమనించిన స్నేహితులు వెంటనే బంధువులు, పోలీసులకు సమాచారం అందించారు. సీఐ శివశంకర్‌, ఎస్సై మహేంద్ర తమ సిబ్బందితో కలిసి కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడటం..కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలను నిలిపేశారు. ప్రవాహం ఆగిన తర్వాత ఉదయాన్నే గాలింపు చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు.

విద్యుదాఘాతానికి మహిళ బలి

కలిగిరి: మండలంలోని పెద్దపాడుకు చెందిన గన్నమనేని పద్మ (55) విద్యుదాఘాతానికి గురై బుధవారం మృతి చెందారు. స్థానికులు, బంధువుల వివరాల మేరకు.. ఇంట్లో కూలర్‌ వేసుకొని కుటుంబసభ్యులతో కలిసి పద్మ మంగళవారం రాత్రి నిద్రించారు. ఉదయాన్నే నిద్రలేచిన పద్మ ప్రమాదవశాత్తూ కూలర్‌పై పడ్డారు. దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలికి కుమారుడున్నారు. కేసు నమోదు చేసి పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు పోలీసులు తరలించారు.

నక్కలగండిలో

చేపల వేట నిలిపివేత

వరికుంటపాడు: మండలంలోని నక్కలగండి రిజర్వాయర్‌లో చేపల వేట నిలిపివేతకు చర్యలు చేపట్టారు. రిజర్వాయర్‌లో లోపాలను ఆసరాగా చేసుకొని చేపల వేటను సాగిస్తున్న అంశంపై ఖాకీ అండ.. నక్కలగండి దందా అనే శీర్షికన సాక్షిలో కథనం బుధవారం ప్రచురితమైంది. దీంతో అధికారులు, సంబంధిత వర్గాలు అప్రమత్తమయ్యాయి. చేపల వేటను బుధవారం నిలిపేశారని స్థానికులు తెలిపారు. రిజర్వాయర్‌ నిర్వహణలో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు సంబంధిత అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆయకట్టుదారులు డిమాండ్‌ చేస్తున్నారు.

శ్రీవారి దర్శనానికి 12 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 22 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 83,858 మంది మంగళవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement