వెంకటాచలం: వెన్నుపోటు రాజకీయాలకు చంద్రబాబు ఆద్యుడని, ఆయన చేసిన మోసాలను మాటల్లో చెప్పేందుకు సమయం చాలదని.. పుస్తక రూపంలో ప్రజల ముందుకు తీసుకెళ్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత పేర్కొన్నారు. వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు, బుక్‌లెట్లను వెంకటాచలంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించిన అనంతరం ఆమె మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక ఏ ముఖ్యమంత్రైనా క నీసం 20 శాతం హామీలనైనా నెరవేర్చేందుకు యత్నిస్తారని, అయితే చంద్రబాబు మాత్రం ఒక్క శాతాన్ని సైతం అమలు చేయలేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఎన్నో హామీలను గుప్పించి కొలువుదీరిన టీడీపీ.. ఆపై వీటిని విస్మరించిందని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తమ సమస్యలతో ఆవేదన వ్యక్తం చేస్తున్నా, చంద్రబాబు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. యూరియా అందుబాటులో లేకపోవడంతో బ్లాక్ మార్కెట్లో కొని పంటలు పండించుకునే దుస్థితి రైతులకు ఏర్పడిందని విమర్శించారు. మెగా డీఎస్సీ పేరుతో రకరకాల జీఓలను విడుదల చేస్తుండటంతో నిరుద్యోగులు అయోమయానికి గురవుతున్నారని చెప్పారు. ముందు ఒక జీఓను విడుదల చేసి తప్పులు చేయడం, వాటిని కప్పిపుచ్చుకునేందుకు మరొకటి జారీ చేస్తూ ప్రభుత్వం నవ్వులపాలవుతోందని ఎద్దేవా చేశారు.
నాడంతా సజావుగా..
జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందజేశారని గుర్తుచేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన ఎరువులు, విత్తనాలను అందించడంతో పంటలను కర్షకులు సంతోషంగా పండించుకున్నారని చెప్పారు. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితి ఎక్కడైనా ఉందానని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన అబద్ధపు హామీల బాండ్ పేపర్లు, కాగితాలు చలి మంటలేసుకోవడానికి తప్ప, దేనికి పనికిరావనే విషయం ప్రజలకు అర్థమైందని తెలిపారు. వెన్నుపోటుకు రెండేళ్ల నిరసన కార్యక్రమాన్ని ప్రతి మండల కేంద్రంలో తమ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించనున్నామని వెల్లడించారు. పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు. నేత చిల్లకూరు సుధీర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, వెంకటాచలం ఎంపీపీ మందా కవిత, వైస్ ఎంపీపీ కనుపూరు కోదండరామిరెడ్డి, మండల కన్వీనర్లు కొణిదెన మోహన్‌నాయుడు, మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, ఉప్పల శంకరయ్యగౌడ్, ముత్తుకూరు జెడ్పీటీసీ నెల్లూరు శివప్రసాద్, నాయకులు కొణిదెన విజయభాస్కర్‌నాయుడు, ఈపూరు రజనీకాంత్‌రెడ్డి, దాసరి భాస్కర్‌గౌడ్, సాయిమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.


