నెల్లూరు(వేదాయపాళెం): జిల్లాలో ఆసక్తి గల నిరుద్యోగ గిరిజన యువతకు సోలార్ ప్యానల్ ఇన్‌స్టలేషన్ టెక్నీషియన్ కోర్సులో ఉచిత శిక్షణను నిర్వహించనున్నామని ఐటీడీఏ పీఓ శ్రీనివాసరావు బుధవారం ఒక పకటనలో తెలిపారు. వెంకటాచలంలోని యూత్ ట్రెయినింగ్ సెంటర్‌లో నెల రోజుల శిక్షణతో పాటు ఉచిత భోజన, వసతి సౌకర్యాలను కల్పించనున్నామని వివరించారు. పది, ఆపై విద్యార్హతలు కలిగి 18 నుంచి 35 ఏళ్లలోపు వారు అర్హులని చెప్పారు. వివరాలకు 81878 99877 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
దళితుల శ్మశాన భూమి ఆక్రమణకు యత్నం
దగదర్తి: మండలంలోని ఉలవపాళ్లలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న దళితుల శ్మశాన భూమిని ఆక్రమించేందుకు జరుగుతున్న యత్నాలతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్మశాన భూమిని స్వాధీనం చేసుకునేందుకు పక్కనే ఉన్న భూమిని కొనుగోలు చేసిన వ్యక్తితో గ్రామానికి చెందిన కొందరు యత్నించడాన్ని దళితులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై సర్వే నిర్వహించేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులను అడ్డుకోవడంతో విషయం ఆఫీసర్ల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయంలో ఇరువర్గాలతో సమావేశాన్ని తహసీల్దార్ లాజరస్, సీఐ శివశంకర్, ఎస్సై మహేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. తమ శ్మశాన భూమిని ఆక్రమించేందుకు ఎలాంటి యత్నాలు చేసినా సహించబోమని దళితులు స్పష్టం చేశారు. సర్వే నంబర్ 53లో సుమారు 3.64 ఎకరాల భూమిని శ్మశానానికి కేటాయించారని చెప్పారు. ఇటీవల ఓ వ్యక్తి గ్రామానికి చెందిన కొందరితో కలిసి ఆక్రమిస్తుంటే అడ్డుకున్నామన్నారు. దీన్ని రక్షించుకునేందుకు తామంతా కలిసి భూమి చుట్టూ హద్దు రాళ్లు, కంచెను వేసుకున్నామని అధికారులకు తెలిపారు. త్వరలోనే అధికారికంగా సర్వేను నిర్వహించి, రికార్డుల ప్రకారం భూమి హద్దులను నిర్ధారించి సమస్యను పరిష్కరిస్తామని రెవెన్యూ, పోలీస్ అధికారులు హామీ ఇచ్చారు.


