● సర్వర్ సమస్యలతో జాప్యం
● ఎండలకు అవస్థలు పడిన అవ్వా, తాతలు
● 87 శాతం దాటని వైనం
నెల్లూరు (పొగతోట): జిల్లాలో సోమవారం సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియలో సర్వర్ల సమస్య కారణంగా తీవ్ర జాప్యం నెలకొంది. ఈ పరిణామంతో పింఛన్లు ఇచ్చేందుకు ఇళ్లకు రాకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. కొందరు వృద్ధులు, మహిళలు సచివాలయాలకు కాళ్లీడ్చుకుంటూ వెళ్లారు. కొన్ని చోట్ల సాయంత్రం వరకు లబ్ధిదారులు సచివాలయాల వద్ద పడిగాపులు పడ్డారు. పంపిణీ ప్రక్రియలో ఏర్పడిన సాంకేతిక ఇబ్బందులతో ఉద్యోగులు సైతం మానసికంగా అవస్థలు పడ్డారు. లబ్ధిదారులకు సమాధానం చెప్పలేక.. అసహనానికి గురయ్యారు. జిల్లాలో 2,90,009 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి ఉండగా, సర్వర్ సమస్య కారణంగా మొదటి రోజు రాత్రి 7 గంటల సమయానికి 2,52,867 మందికి పంపిణీ చేయడంతో 87.17 శాతంగా నమొదైంది. ప్రతి నెలా మొదటి రోజు 95 శాతం మందికి పంపిణీ చేసే వారు. ప్రస్తుతం సర్వర్ సమస్యతో పంపిణీలో తీవ్ర జాప్యం నెలకొంది. ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకుండా ఒక ప్రాంతంలోకి అందరిని రమ్మని నగదు అందజేశారు. దీంతో అవ్వా, తాతలు నానా అవస్థలు పడ్డారు. వైఎస్సార్‌సీపీ పాలనలో పింఛన్ లబ్ధిదారులు అవ్వా, తాతలు ఇబ్బందులు పడకుండా వలంటీర్లు తెల్లవారు జామున ఇంటి తలుపులు తట్టి నగదు చేతుల్లో పెట్టిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అటువంటి పరిస్థితులు కనుమరుగయ్యాయి. పింఛన్ల నగదు పంపిణీ చేసే వారు ఒక ప్రాంతంలో ఉంటే లబ్ధిదారులందరూ అక్కడికి వెళ్లి నగదు తీసుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఇంటింటికి వెళ్లి నగదు అందిస్తున్నామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందే కానీ వాస్థవ పరిస్థితులు బిన్నంగా ఉన్నాయి. ఈ నెలలో పింఛన్ల నగదు కోసం లబ్ధిదారులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. దివ్యాంగులు వృద్ధులు ఉష్ణోగ్రతలు అఽధికంగా ఉండడంతో నానా ఇబ్బందులు పడ్డారు.


