గోవును గోమాతగా కొలిచే దేశమిది. గోవుల సంరక్షణ పేరుతో ఉద్యమాలు చేసే సంస్థలు, వేదికలపై సంస్కృతి పరిరక్షణ ప్రసంగాలు చేసే నేతలకు కొదవలేదు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. చట్టాలు కఠినంగా ఉన్నా, నిబంధనలు స్పష్టంగా ఉన్నా, అక్రమ రవాణా నుంచి వధ వరకు వ్యవస్థీకృతంగా సాగుతున్న వ్యవహారాలపై అధికార యంత్రాంగాలు అవినీతి మత్తులో జోగుతూ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా ఘటన వెలుగు చూసినప్పుడు మొక్కుబడిగా చర్యలు తీసుకుని చేతులు దులుపుకొంటున్నారనే విమర్శలు లేకపోలేదు.
నెల్లూరు సిటీ: నెల్లూరు కేంద్రంగా గో వధ, మాంసం ఎగుమతులు, గోవుల అక్రమ రవాణా వ్యవస్థీకృతంగా సాగుతోంది. సనాతన ధర్మ పరిరక్షకులమని ప్రచారం చేసుకునే కూటమి పార్టీల నేతలు కాసులకు కక్కుర్తి పడి దేవతామూర్తిగా కొలిచే గోమాతలను నిర్దాక్షిణ్యంగా వధిస్తున్నారు. వెయ్యి.. పదిహేనొందలకు ఆశ పడి పశుసంవర్థకశాఖాధికారులు మరణ శాసనాన్ని లిఖిస్తున్నారు. చట్టాలకు, నిబంధనలకు లోబడి కొన్ని రకాల పశువులను కబేళాల్లోనే వధించాల్సి ఉండగా అధికార పార్టీ నేతల ముసుగులో కొందరు టీడీపీ నేతలు శివారు ప్రాంతాలను అడ్డాగా, మానవ దుర్భేద్య ప్రాంతాలుగా చేసుకుని ఇలాంటి దారుణాలకు తెగబడుతున్నారు. నెల్లూరు రూరల్ మండలం చింతారెడ్డిపాళెం పరిధిలో వెలుగు చూసిన గోవధ ఘటన మరోసారి అధికారుల పనితీరుపై తీవ్ర అనుమానాలను రేకెత్తి స్తోంది. అధికార పార్టీ నేతలు కొందరు గోవులను అక్రమంగా తరలించి వధిస్తున్న విషయం వెలుగులోకి రా వడం చర్చనీయాంశంగా మారింది. చట్టాన్ని అమలు చేయాల్సిన శాఖలు, పర్యవేక్షించాల్సిన అధికారులు, గోవుల పరిరక్షణ కోసం గొంతెత్తే సంస్థలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
గోవధపై కఠిన చట్టాలు.. అమల్లో మాత్రం శూన్యం?
గోవధను నిరోధించే ప్రత్యేక చట్టాలు అమల్లో ఉన్నా యి. గోవులను వధించడం నిషేధం. ఎద్దులు, దున్నపోతులు వంటి పశువులను కూడా వధించాలంటే పశుసంవర్ధక శాఖతోపాటు సంబంధిత అధికారుల నుంచి ఫిట్‌నెస్ ధ్రువీకరణ, అనుమతి పత్రాలు తప్పనిసరి. అయితే చట్టాల పుస్తకాల్లో కనిపించే కఠినత్వం, క్షేత్రస్థాయిలో మాత్రం కనిపించడం లేదనే విమర్శలున్నాయి. గోవులను రాత్రి వేళ తరలించడం, శివారు ప్రాంతాల్లో వధించడం, మాంసాన్ని రహస్యంగా విక్రయిస్తున్నా సంబంధిత శాఖలు ఎందుకు గుర్తించలేకపోతున్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
బోడిగాడితోట ఘటన మరిచిపోయారా..?
జిల్లాలో చింతారెడ్డిపాళెం ఘటన మొదటిది కాదు. గతంలో నగర నడిబొడ్డున బోడిగాడితోట ప్రాంతంలో సుమారు నాలుగు టన్నుల పశుమాంసాన్ని స్వాధీనం చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. ఆ సమయంలో గోదాముల్లో నిల్వ ఉంచిన పశువుల చర్మాలు, ఎముకలు బయటపడటంతో అధికారులు సైతం విస్తుపోయిన పరిస్థితి. అయితే అంత పెద్ద ఘటన వెలుగు చూసినా, ఆ తర్వాత ఇలాంటి కార్యకలాపాలపై దృష్టి సారించకపోవడంతోనే చింతారెడ్డిపాళెం ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ సైతం ఇదే ప్రప్రథం కాదు.. ప్రతి వారం భారీ స్థాయిలో గోవధ జరుగుతోందని సమాచారం.
శివారు ప్రాంతాలే అడ్డాగా..
నెల్లూరు నగర శివారు ప్రాంతాలు, జనసంచారం తక్కువగా ఉండే లేఅవుట్లు, గోదాములు కొందరికి సురక్షిత కేంద్రాలుగా మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోవులను తరలించి వధించే ముందు చుట్టు పక్కల ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా రని స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యవహారాలకు రా జకీయ అండ ఉందనే ప్రచారం బలంగా వినిపిస్తోంది.
చింతారెడ్డిపాళెం ఘటనలో హడావుడి చర్యలు
చింతారెడ్డిపాళెంలోని గజలక్ష్మి లేఅవుట్‌లో సుమారు 20 గోవులను వధించారంటూ అక్కడి కళేబరాలు స్పష్టం చేస్తుండగా, పోలీసులు మాత్రం కేవలం ఐదు ఎద్దులను మాత్రమే విధించారంటూ కేసు కట్టి చేతులు దులుపుకొన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోవధ జరుగుతోందనే సమాచారం మీడియాల్లో వైరల్ కావడంతో నెల్లూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో అక్కడ వధకు సిద్ధంగా ఉంచిన 9 ఆవులను గుర్తించి గోశాలకు తరలించారు. అయితే ఈ వధలో అధికార పార్టీకి చెందిన ఓ నేతతో పాటు మరో నలుగురి పాత్ర ఉన్నట్లు పోలీసులు పేర్కొంటూ వారిని హడావుడిగా అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. చిన్నపాటి నేరం చేస్తేనే నేరస్తులను మీడియా ముందు ప్రవేశ పెట్టి హడావుడి చేసే పోలీస్ యంత్రాంగం ఈ విషయంలో ఎందుకు రహస్యంగా పనికానిచ్చేశారో అర్థమవుతోంది. నిందితులు టీడీపీ నేతలు కావడంతో కేసు తీవ్రతను తగ్గించేలా వధించినవి గోవులు కాదు.. ఎద్దులంటూ రికార్డు చేయడం వెనుక మతలబును బయటపెట్టాలని హిందుత్వ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అదే ప్రాంతంలో 9 గోవులను పట్టుకున్నప్పుడు.. వధించినవి గోవులు కాకుండా ఎద్దులని చెప్పడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గోరక్షణ పేరుతో గొంతెత్తేవారు ఎక్కడ?
దేశ వ్యాప్తంగా గోవుల సంరక్షణ అంశంపై తరచూ ఆందోళనలు చేసే సంస్థలు, హిందుత్వం పేరుతో ప్రచారం చేసే సంఘాలు, గోరక్షణపై ఉపన్యాసాలిచ్చే నేతలు ఇ లాంటి ఘటనల సమయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గోవుల రక్షణ అ నేది కేవలం రాజకీయ నినాదాలకే పరిమిత మా? లేక నిజంగా చట్ట అమలుపై ఒత్తిడి తీసుకురావా లనే బా ధ్యత ఉందాననే చర్చ మొదలైంది. వీటి పరిరక్షణపై చిత్తశుద్ధి ఉంటే అక్రమ రవాణా, వధ, విక్ర యాలపై నిరంతర పర్యవేక్షణ కోసం సర్కార్‌పై ఒత్తిడి తీసుకురావాలని పలువురు అభిప్రాయపడుతున్నాయి.
అక్రమ రవాణా నుంచి వధ వరకు సాగుతున్న వ్యవస్థీకృత దందా
గో సంరక్షణ చట్టాలు
కాగితాలకే పరిమితం
అధికార పార్టీ నేతల ముసుగులో కొందరి దారుణం
యథేచ్ఛగా గోవుల అక్రమ రవాణా, మరణశాసనం
రాజకీయ అండతో నడుస్తున్న
అక్రమ వ్యాపారం
మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగాలు
మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగాలు
అక్రమ రవాణా, వధ, విక్రయాలు అన్నీ ఒకే రోజులో జరిగే ప్రక్రియలు కావు. పశువులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించి వధించి.. మాంసంగా విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతుంటే సంబంధిత శాఖలకు సమాచారం లేకపోవడాన్ని చూస్తే నిఘా వ్యవస్థల పని తీరును శంకించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే మామూళ్ల మత్తులో పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా? అనే అనుమానాలు లేకపోలేదు. కొంత మంది అధికారులు నిర్లక్ష్యం, మరికొందరి మౌనం, ఇంకొందరి పాత్రపై వస్తున్న ఆరోపణలు దర్యాప్తు అవసరాన్ని సూచిస్తున్నాయి.


