అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధం

Jun 1 2026 12:08 AM | Updated on Jun 1 2026 12:08 AM

సర్వేపల్లిలో రైతుల పేరుతో

నిధుల దోపిడీ

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

పొదలకూరు: అవినీతిపై సోమిరెడ్డితో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని.. సర్వేపల్లి నియోజకవర్గంలో రైతుల పేరుతో నిధుల దోపిడీ ముమ్మాటికీ జరుగుతోందనే అంశాన్ని నిరూపిస్తానని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. మండలంలోని నావూరు చెరువు కట్ట పనులను ఆదివారం పరిశీలించారు. పనులు నాసిరకంగా జరిగాయంటూ ఇరిగేషన్‌ శాఖ అధికారులపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇరిగేషన్‌ పనుల పేరుతో ఆ ప్రాంతంలో జరుగుతున్న దోపిడీని కాకాణికి నావూరు, చెన్నారెడ్డిపల్లి గ్రామస్తులు వివరించారు. సాగునీటి కాలువలు, చెరువుల పనుల్లో నాణ్యత లోపించిందని.. పక్కనే ఉన్న చవుడు మట్టిని కట్టపై పోసి దూరంగా లీడ్‌ చూపి నిధులను ఆరగించారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల రిపేర్ల పేరుతో సుద్దమట్టిని తోలి బిల్లులు చేసుకుంటున్నారని వివరించారు. గతంలో ఉన్న గ్రావెల్‌ రోడ్లపై వీటిని పోయడం ద్వారా వర్షమొస్తే రొచ్చుగా మారే ప్రమాదం ఉందని తెలిపారు.

రూ.కోట్లు కొల్లగొడుతున్నారు..

ఈ ప్రాంతంలో చెరువు, పొలాలకు వెళ్లే రోడ్లు ఎంత నాసిరకంగా ఉన్నాయో పరిశీలిస్తే అర్థమవుతుందని కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. రైతుల పేరుతో పనులు చేయిస్తూ రూ.కోట్లను సోమిరెడ్డి కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. నావూరు చెరువు పనులపై తాను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని, సుముఖంగా ఉంటే తేదీని సోమిరెడ్డి ఖరారు చేయాలని.. ఈ కట్టపైనే చర్చా వేదికను సిద్ధం చేస్తామని వెల్లడించారు. ఇరిగేషన్‌ పనులు ఎంత నాసిరకంగా జరిగాయో.. దొంగ బిల్లులను ఏ విధంగా స్వాహా చేశారో.. సోమిరెడ్డి సిద్ధపడితే తానే స్వయంగా వచ్చి రైతులతో కలిసి పర్యటించి నిజాలను నిగ్గుతేలుస్తానని పేర్కొన్నారు. జీపీఎస్‌తో పనులకు ముందు.. తర్వాత ఫొటోలు తీసుకొని వీటిని పూర్తి చేస్తున్నామని సోమిరెడ్డి వెల్లడిస్తున్నారని తెలిపారు. నావూరు చెరువు కట్ట పనుల కు సంబంధించి ముందు.. తర్వాత ఫొటోలను విడుదల చేయాలని సవాల్‌ విసిరారు. అభివృద్ధిని విస్మరించి తీవ్రమైన అవినీతికి పాల్పడుతూ దోచు కుంటున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి పనులపై విచారణ నిర్వహిస్తే సోమిరెడ్డితో పాటు ఆయన కుమారుడు, అధికారులు బలికాక తప్పదన్నారు. ఇరిగేషన్‌ అధికారులకు కౌంట్‌ డౌన్‌ స్టార్టయిందని, విచారణలో అవినీతి బయటపడుతుందని పేర్కొన్నారు. చర్చకొస్తే అన్ని విషయాలు వెలుగుచూస్తాయని.. బహిరంగ చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు. నేతలు గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, రావుల ఇంద్రసేన్‌గౌడ్‌, వెంకటశేషయ్య, దాసరి భాస్కర్‌గౌడ్‌, నోటి బాలకొండారెడ్డి, వెల్మిరెడ్డి సుబ్బారెడ్డి, బొడ్డు నరసింహు లు, రమేష్‌, గాలం హరి, కోడూరు మాలకొండారెడ్డి, నీలం మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement