అగ్రిల్యాబ్‌లకు మంగళం | - | Sakshi
Sakshi News home page

అగ్రిల్యాబ్‌లకు మంగళం

Jun 1 2026 12:08 AM | Updated on Jun 1 2026 12:08 AM

కూటమి ప్రభుత్వం రైతుల విషయంలో నిర్లక్ష్యం చూపుతోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అన్నదాతలకు ఉపయోగపడే పనులు ఎన్నో చేయగా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉన్నత ఆశయంతో నాడు ప్రతి నియోజకవర్గంలో అగ్రిల్యాబ్‌లు ఏర్పాటు చేయగా చంద్రబాబు సర్కారు వాటికి

మంగళం పాడుతోంది.

పొదలకూరు: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి ఒక అగ్రికల్చర్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. రైతే రాజు అనే భావనతో వారి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు చెక్‌ పెట్టేందుకు ఈ ల్యాబ్‌లను గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. నియోజకవర్గ స్థాయిలో రూ.50 లక్షలు వెచ్చించి భవనాలతోపాటు పరీక్షలకు అవసరమైన సామగ్రిని ఏర్పాటు చేసింది. రైతులు ఉచితంగా విత్తనాలు, ఎరువుల నాణ్యత పరీక్షలు చేయించుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అగ్రిల్యాబ్‌ల నిర్వహణ కష్టంగా ఉందని, అవసరమైన నిధులు వెచ్చించలేమనే కారణంతో జిల్లాకు ఒకటి సరిపోతుందనే నిర్ణయానికి వచ్చింది. దీంతో నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన ల్యాబ్‌లను తొలగించే ప్రక్రియ చేపట్టింది. ప్రస్తుతం పొదలకూరు, కోవూరు ప్రాంతాల్లోని ల్యాబ్‌లను తొలగించి వ్యవసాయ శాఖకు అప్పగించగా, కావలి, ఉదయగిరి, ఆత్మకూరు, గూడూరు ప్రాంతాల్లో ఉన్నవాటిని కూడా తొలగించే చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు నెల్లూరులో గత ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ అగ్రిల్యాబ్‌ నిర్మాణానికి అదనపు నిధులు కేటాయించి పనులు ప్రారంభించింది. అయితే ఆ నిర్మాణ పనులను ప్రస్తుత ప్రభుత్వం రెండేళ్లుగా పూర్తి చేయకుండా కాలయాపన చేసింది. ఇప్పుడు పూర్తి చేసి త్వరలో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.

రైతులకు ఉపయోగం

మార్కెట్లోకి వచ్చే ప్రతి ఇన్‌పుట్‌ నమూనాను (శాంపిల్‌) ఇక్కడ పరీక్షించుకునే అవకాశం ఉండటంతో రైతుల్లో సాగుపై విశ్వాసం పెరిగేది. గతంలో నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు ఉపయోగించి రైతులు ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. మార్కెట్‌లో కొనుగోలు చేసిన విత్తనాలు, ఎరువులను అన్నదాతలు నేరుగా అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌కు తీసుకెళ్లి ఉచితంగా పరీక్షించుకునే సౌకర్యాన్ని అప్పటి ప్రభుత్వం క ల్పించింది. మూడు దశల్లో విత్తనాలు, ఎరువుల పరీక్షలు నిర్వహించేవారు. ఇందుకోసం రాష్ట్రంలో నాలుగు రీజినల్‌ సెంటర్లు ఏర్పాటు చేసి, శాంపిళ్లను అక్కడికి పంపించి కోడింగ్‌ విధానంలో పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించేవారు. దీంతో పరీక్షల్లో పారదర్శకత నెలకొని, కంపెనీలకు అనుకూలంగా నివేదికలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. నాణ్యత లోపాలు తేలితే రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించి సంబంధిత కంపెనీల నుంచి పరిహారం పొందే అవకాశమూ ఉండేది. ప్రతి ల్యాబ్‌లో ఒక అనలిస్ట్‌ (ఏఓ), ఇద్దరు అసిస్టెంట్‌ అనలిస్టులు (ఏఈఓలు) పనిచేసేవారు. వీరిలో ఒకరు విత్తనాలు, మరొకరు ఎరువుల పరీక్షల బాధ్యతలు నిర్వహించేవారు.

ఖర్చులు భరించలేమంటూ..

రైతుల సంక్షేమం కోసం గత ప్రభుత్వం ఎంత ఖర్చయినా వెనుకాడబోమని, వ్యవసాయాన్ని దండగ కాకుండా పండగగా మారుస్తామని ప్రకటించింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌ నిర్వహణ ఖర్చులను కూడా భరించలేక తొలగిస్తోందనే విమర్శలున్నాయి. తమపై పెట్టే ఖర్చులకు కూడా లెక్కలు కడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్‌ను కూడా గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమే నిర్మాణ దశకు తీసుకెళ్లగా, ఇప్పుడు దానినే కొనసాగిస్తూ మిగిలిన నియోజకవర్గ స్థాయి ల్యాబ్‌లను మూసివేస్తున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో ల్యాబ్‌లు ఉంటే గ్రామీణ ప్రాంత రైతులు సులభంగా విత్తనాలు, ఎరువుల నాణ్యత పరీక్షలు చేయించుకునే అవకాశం ఉండేది. అయితే ప్రభుత్వం అగ్రి ల్యాబ్‌ వ్యవస్థ వైఫల్యం చెందిందనే భావన కల్పిస్తూ వాటిని తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. పొదలకూరు, కోవూరులోని ల్యాబ్‌లు సరిగా పనిచేయలేదని పేర్కొంటూ వాటిని తొలగించారు.

గత ప్రభుత్వంలో నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు

నకిలీ విత్తనాలు, ఎరువులపై పరీక్షలు

నేడు జిల్లాకు ఒక్కటే..

ఖర్చు భరించలేమని

నియోజకవర్గాల్లో తొలగింపు

జగన్‌ మార్క్‌ అభివృద్ధికి తూట్లు

రైతుల ప్రయోజనాలు పట్టని ప్రభుత్వం

Advertisement
 
Advertisement
Advertisement