నిలిపేస్తారా.. వదిలేస్తారా? | - | Sakshi
Sakshi News home page

నిలిపేస్తారా.. వదిలేస్తారా?

Jun 1 2026 12:08 AM | Updated on Jun 1 2026 12:08 AM

చిల్లకూరు: వాతావరణ, పర్యావరణ శాఖల సూచనలు, ప్రభుత్వ ఆదేశాల మేరకు వర్షాకాలం నేపథ్యంలో సోమవారం నుంచి అక్టోబర్‌ 15 వరకు నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలను నిలిపివేస్తున్నట్లు గనుల శాఖ శనివారం ప్రకటించింది. అయితే ఈ ఆదేశాలు స్వర్ణముఖి నది పరీవాహక ప్రాంతాలకు వర్తిస్తాయా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గనుల శాఖ అధికారులు ప్రధానంగా పెన్నానది పరీవాహక ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకుని ఇసుక తవ్వకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యామ్నాయంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న స్టాక్‌ పాయింట్ల నుంచి మాత్రమే ఇసుకను కొనుగోలు చేసుకోవాలని సూచించారు. పెన్నానది ప్రవహించే ప్రాంతాల్లో ఎక్కడా తవ్వకాలు చేపట్టరాదని హెచ్చరికలు జారీ చేశారు.

ఇక్కడ పరిస్థితి వేరు

గూడూరు నియోజకవర్గ పరిధిలో ప్రవహించే స్వర్ణముఖి నది పరీవాహక ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల పరిధిలో ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నప్పటికీ, వాటిపై గనుల శాఖ అధికారులు ఎలాంటి ఆంక్షలు విధించకపోవడంతో నిషేధాజ్ఞలు ఇక్కడ వర్తించవన్న భావన వ్యక్తమవుతోంది. కోట మండలం గూడలి ప్రాంతంలో ప్రభుత్వం అధికారిక ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేసి అక్కడి నుంచి మాత్రమే ఇసుక తవ్వకాలు, రవాణాకు అనుమతులిచ్చింది. అయితే రీచ్‌ల పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లు స్వర్ణముఖి నది పరీవాహక ప్రాంతాల్లో యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతున్నారనే ఆరోపణలున్నాయి. లక్షల టన్నుల ఇసుకను తవ్వి తరలిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. తవ్విన ఇసుకను విద్యానగర్‌ ప్రాంతంలో డంపింగ్‌ చేస్తున్నారు. కానీ రోజూ కాంట్రాక్టర్లు స్వర్ణముఖి నదిలోకే ట్రాక్టర్లు, టిప్పర్లను నేరుగా తీసుకెళ్లి అక్కడ్నుంచే లోడింగ్‌ చేసి తరలిస్తున్నారు.

ఇతర నగరాలకు..

గూడూరు నియోజకవర్గ అవసరాలకే పరిమితమైతే ఇసుక తవ్వకాల ప్రభావం కొంత మేర తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, ఇక్కడ తవ్వుతున్న దానిని భారీగా చైన్నె, బెంగళూరు వంటి నగరాలకు తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో స్వర్ణముఖి నదిలో ఇసుక నిల్వలు తగ్గిపోవడంతోపాటు భూగర్భ జలాలపై కూడా ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో నదుల్లో సహజసిద్ధంగా ఇసుక నిల్వలు పెరగడం, భూగర్భ జలాలు పునరుద్ధరించడం కోసం ప్రభుత్వం విధించిన నిషేధాజ్ఞలను స్వర్ణముఖి నది పరీవాహక ప్రాంతాల్లో కూడా కచ్చితంగా అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు. గనుల శాఖ అధికారులు ఈ ప్రాంతంలోని కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, వర్షాకాలం ముగిసే వరకు ఇసుక తవ్వకాలను పూర్తిగా నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

స్వర్ణముఖిలో ఇసుక

తవ్వకాలకు బ్రేక్‌ పడేనా?

గనుల శాఖ హెచ్చరికలు వర్తించవా?

పెన్నానదిలో తవ్వకాల నిలిపివేత

స్వర్ణముఖిలో మాత్రం యథేచ్ఛగా..

Advertisement
 
Advertisement
Advertisement