● మూడుచోట్ల తెంపుకెళ్లిన
దుండగులు
నెల్లూరు(క్రైమ్): బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో దొంగల కళ్లన్నీ ఆభరణాలపైనే ఉన్నాయి. జన సంచారం తక్కువగా, తప్పించుకునేందుకు వీలుగా ఉండే ప్రాంతాల్లో బైక్‌లపై తిరుగుతూ చోరీలు చేస్తున్నారు. నెల్లూరు నగరంలో ఆదివారం గొలుసు దొంగలు హల్‌చల్ చేశారు. మూడు వేర్వేరు ప్రాంతాల్లో మహిళల మెడల్లోని బంగారు గొలుసులను తెంపుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు.
బస్టాండ్‌కు వెళ్తున్న సమయంలో..
విజయమహాల్ గేటు సమీపంలో ప్రశాంతి కుటుంబం నివాసం ఉంటోంది. ఆమె తెల్లవారుజామున సుమారు 4:35 గంటల ప్రాంతంలో ఇందుకూరుపేట వెళ్లేందుకు బస్సు కోసం ఆత్మకూరు బస్టాండ్‌కు నడుచుకుంటూ బయలుదేరారు. ఒంటరిగా వెళ్లడాన్ని ఇద్దరు దుండగులు గమనించారు. ఒకతను నడుచుకుంటూ మరొకడు బైక్‌పై వెంబడించారు. జేమ్స్ గార్డెన్ వద్ద దుండగుడు ఆమె మెడలోని మూడున్నర సవర్ల బంగారు సరుడును తెంపుకొని వెనుక వస్తున్న బైక్‌పై ఎక్కి పరారయ్యాడు. బాధితురాలు నవాబుపేట పోలీసుకు ఫిర్యాదు చేశారు.
వాకిలి శుభ్రం చేస్తుండగా..
పడారుపల్లి ఆటోనగర్ కాలనీలో పి.కావేరి కుటుంబం నివాసం ఉంటోంది. ఆమె ఉదయం సుమారు 5:10 గంటల ప్రాంతంలో ఇంటిముందు వాకిలి శుభ్రం చేస్తుండగా ఇద్దరు దుండగులు గమనిస్తూ బైక్‌పై అటుగా వెళ్లారు. కొద్దిదూరంలో వాహనాన్ని ఆపగా ఒకతను ఆమె వద్దకు వచ్చి మెడలోని మూడున్నర సవర్ల బంగారు సరుడు తెంపుకొని పరుగెత్తుకుంటూ వెళ్లి బైక్ ఎక్కి పరారయ్యారు. బాధితురాలు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మార్నింగ్ వాకింగ్‌లో ఉండగా..
హరనాథపురంలో సృజన నివాసం ఉంటున్నారు. ఉదయం సుమారు 5:30 గంటల ప్రాంతంలో ఆమె తన భర్తతో కలిసి చిల్డ్రన్స్ పార్కు సాయిబాబా మందిరం సమీపంలో మార్నింగ్ వాకింగ్ చేయసాగారు. ఈక్రమంలో ఇద్దరు గుర్తుతెలియని దుండగులు బైక్‌పై వచ్చి ఆమె మెడలోని రెండు సవర్ల బంగారు గొలుసును తెంపుకెళ్లారు. బాధితురాలు బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అప్రమత్తౖమైన పోలీసులు
గొలుసు చోరీలపై నవాబుపేట, వేదాయపాళెం, బాలాజీనగర్ ఇన్‌స్పెక్టర్‌లు జి.వేణుగోపాల్‌రెడ్డి, కె.శ్రీనివాసరావు, కె.సాంబశివరావు అప్రమత్తమై సాంకేతికత ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. చిల్డ్రన్స్ పార్కు వద్ద గొలుసు దొంగతనం అనంతరం నిందితులు జాతీయ రహదారి మీదుగా కావలి వైపు వెళ్లినట్లు గుర్తించి ఆ ప్రాంత పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. నిందితులు యూపీ గ్యాంగ్‌గా అనుమానిస్తున్నారు.


