● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి
నెల్లూరురూరల్: ‘కూటమి ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ద్వారానే న్యాయం జరుగుతుందనే నమ్మకం బలపడుతోంది’ అని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ నెల్లూరు సిటీ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. పెద్ద సంఖ్యలో యువత ఆదివారం నగరంలోని సిటీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పర్వతరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 53వ డివిజన్ ఇన్‌చార్జి వెంగళ్‌రెడ్డికి వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర కార్యదర్శి పదవి లభించడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఆ డివిజన్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఆయన్ను అభినందించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ రోజురోజుకూ బలోపేతం అవుతోందన్నారు. పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్టీతో కలిసి పనిచేస్తున్న వారికి భవిష్యత్‌లో సముచిత గుర్తింపు, గౌరవం లభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వెంగళ్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులు, పర్వతరెడ్డి ప్రోత్సాహంతో తనకు రాష్ట్ర స్థాయి పదవి లభించడం ఆనందంగా ఉందన్నారు.


