రామకృష్ణ ఆగడాలకు అంతే లేదు | - | Sakshi
Sakshi News home page

రామకృష్ణ ఆగడాలకు అంతే లేదు

May 31 2026 1:06 AM | Updated on May 31 2026 1:06 AM

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికారాన్ని అడ్డం పెట్టుకుని కావలిలోని కొందరు పచ్చ నేతలు కండ కావరంతో రెచ్చిపోతున్నారు. సామాన్య ప్రజల నుంచి ప్రతిపక్ష నాయకులు, మీడియాపైనా చెలరేగిపోతున్న వీరు.. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపైనా విరుచుకు పడుతున్నారు. తమ స్థాయి మరిచి విజిలెన్స్‌ సీఐ అధికారాలనే ప్రశ్నించడమే కాకుండా ఆయనపై రౌడీయిజం చేయడం పచ్చ నేతల అరాచకాలకు పరాకాష్టగా నిలుస్తోంది.

అసలేం జరిగిందంటే..

కావలి పట్టణం, రూరల్‌ పరిధిలో ముగ్గురు నేతలు కలిసి గతంలో 325 ఎకరాల్లో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేశారు. ఇందులో సుమారు 21.45 ఎకరాలు ఇరిగేషన్‌కు చెందిన కాలువలను ఆక్రమించారు. ఆయా వెంచర్లలోని ప్లాట్లను రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ అయిన టీడీపీ నేత చవల రామకృష్ణ ఎంతో మందికి విక్రయాలు చేయించారు. అయితే అక్రమ రియల్‌ వెంచర్లు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అధికారంలోకి రాగానే విజిలెన్స్‌ విచారణ చేపట్టాలని లేఖ రాశారు. ఈ క్రమంలో సదరు వెంచర్ల యజమానులు ఎమ్మెల్యేతో లోపాయికారి ఒప్పందం చేసుకోవడం, అందులో భాగంగా ఆయన బంధువుకు మరో ప్రాంతంలో 18 ఎకరాలు భూములు కొని ఆయన పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించడంతో ఈ వ్యవహారం మరుగున పడిపోయింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు ముఖ్య అనుచురుడు అయిన సదరు రామకృష్ణను కావలి ఏరియా వైద్యశాల డైరెక్టర్‌గా నియమించారు. ఇంకేముంది అధికార మదంతో సదరు నేత చెలరేగిపోతున్నాడు.

కావ్యకు.. బీద బ్రదర్స్‌తో చెడడంతో..

ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. ఇటీవల మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకున్న తమిళ బోట్లను బీద మస్తాన్‌రావు వదిలేయించడంతో తీర గ్రామాలు అట్టుడికిపోతున్న విషయం తెలిసిందే. బీద సోదరులతో సాన్నిహిత్యం చెడిపోయిన క్రమంలో దీనికి ముందు సదరు తమిళ బోట్ల యజమానితో జరిగిన ఫోన్‌ సంభాషణల కాల్‌ డేటా బయటకు రావడానికి ఎమ్మెల్యేనే కారణమని భావించిన బీద సోదరులు అక్రమ వెంచర్లపై విజిలెన్స్‌ విచారణను తెరపైకి తెచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలు దఫాలుగా క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన విజిలెన్స్‌ అధికారులు, తాజాగా గురువారం రాత్రి కావలి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆయా వెంచర్లలో జరిగిన రిజిస్ట్రేషన్లపై విచారణకు విజిలెన్స్‌ సీఐ నరసింహరావు వచ్చారు.

విజిలెన్స్‌ సీఐపై దాడికి యత్నిస్తున్న రామకృష్ణ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేత రామకృష్ణ ఆగడాలకు అంతే లేకుండా పోయింది. ఆయన రియల్‌ ఎస్టేట్‌ వెంచర్ల బ్రోకర్‌గా వ్యవహరించడమే కాకుండా రియల్‌ ఎస్టేట్‌ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు పదవులను అడ్డం పెట్టుకొని అధికార పార్టీ అండదండలతో అనేక అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. గతంలో ఏరియా వైద్యశాలలో న్యూస్‌ కవరేజ్‌ నిమిత్తం మీడియా ప్రతినిధులు ఉండగా ఆస్పత్రి ప్రాంగణంలో విలేకరులు ఉండకూడదంటూ దౌర్జన్యం చేయడమే కాకుండా పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పట్లో మీడియా అంతా ఏకమై ఏరియా వైద్యశాలలో జరుగుతున్న అవకతవకలపై విచారణ చేపట్టాలంటూ పట్టు బట్టింది. దీంతో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి స్వయంగా ఆస్పత్రికి చేరుకుని మీడియాకు సర్ది చెప్పడం తెలిసిందే. సదరు రామకృష్ణను ఏ విధంగా వెనకేసుకుని వస్తున్నాడో అర్థమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement