ఉపాధిలో అవినీతిపై విచారణ | - | Sakshi
Sakshi News home page

ఉపాధిలో అవినీతిపై విచారణ

May 31 2026 1:06 AM | Updated on May 31 2026 1:06 AM

కలువాయి(సైదాపురం): మండలంలోని వెంకటరామరాజుపేటలో ఉపాధి పనుల్లో బినామీ మస్తర్లు, హార్టికల్చర్‌, ఫెరికల్చర్‌లో జరుగుతున్న అక్రమాలపై క్షేత్రస్థాయిలో విచారణను ఆత్మకూరు క్లస్టర్‌ ఏపీడీ శంకర్‌నారాయణ శనివారం చేపట్టారు. ‘అవినీతి ఉపాధి’ అనే శీర్షికన సాక్షిలో కథనం శుక్రవారం ప్రచురితమైన నేపథ్యంలో ఆయన స్పందించారు. విచారణ నివేదికను పీడీకి అందజేశామని ఆయన తెలిపారు.

ఇంటర్‌ పరీక్షలకు

563 మంది గైర్హాజరు

నెల్లూరు (టౌన్‌): ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 563 మంది విద్యార్థులు శనివారం గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సర పరీక్షలకు 1123 మందికి గానూ 1008 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన ద్వితీయ సంవత్సర పరీక్షకు 3333 మందికి గానూ 448 మంది గైర్హాజరయ్యారు.

డీసీపల్లిలో

313 పొగాకు బేళ్ల విక్రయం

మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 313 బేళ్లను శనివారం విక్రయించామని నిర్వహణాధికారి సునీల్‌కుమార్‌ తెలిపారు. వేలానికి 324 బేళ్లు రాగా, వీటిలో 313ను విక్రయించగా, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని చెప్పారు. 44,232.4 కిలోల పొగాకును విక్రయించగా, రూ.1,01,64,411 వ్యాపారం జరిగిందని వివరించారు. గరిష్టంగా కిలో రూ.250.. కనిష్టంగా రూ.190.. సగటు ధర రూ.229.80గా నమోదైందని వెల్లడించారు. ఎనిమిది కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారన్నారు.

శ్రీవారి దర్శనానికి

24 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. శిలాతోరణం వద్దకు క్యూ చేరుకుంది. స్వామివారిని 78,389 మంది శుక్రవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 45,283 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.15 కోట్లను సమర్పించారు. టైమ్‌ స్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.

హోరాహోరీగా

క్యారమ్స్‌ పోటీలు

నెల్లూరు (టౌన్‌): నగరంలోని నెల్లూరు క్లబ్‌లో ఎస్పీఎస్సార్‌ నెల్లూరు డిస్ట్రిక్ట్‌ క్యారమ్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రెండో రోజు శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి క్యారమ్స్‌ పోటీలు హోరాహోరీగా సాగాయి. జిల్లా ర్యాంకింగ్‌ టోర్నీ అండర్‌ – 19 విభాగంలో జరిగిన ఫైనల్స్‌లో అభిషేక్‌, శశిధర్‌ మొదటి రెండు స్థానాలను సాధించారు. మోజెస్‌ తృతీయ స్థానంలో నిలిచారు. జిల్లా ర్యాంకింగ్‌ పురుషుల విభాగంలో సెమీ ఫైనల్స్‌కు వేణుమాధవ్‌, మల్లికార్జున చేరారు.

ఇజ్రాయెల్‌లో ఉద్యోగావకాశాలు

నెల్లూరు(పొగతోట): ఇజ్రాయెల్‌లో హోమ్‌ బేస్ట్‌ కేర్‌గివర్‌ ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి అబ్దుల్‌ ఖయ్యూం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 25 నుంచి 45 ఏళ్లలోపు ఉండి జీడీఏ, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసిన అభ్యర్థులు వీటికి అర్హులని చెప్పారు. నెలకు వేతనంగా రూ.1,99,770 లభించనుందని, రెండేళ్ల ఒప్పంద కాలం ఉంటుందని వివరించారు. పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని.. ఆన్‌లైన్‌, వీడియో రికార్డింగ్‌ ద్వారా ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారని తెలిపారు. వివరాలకు 99888 53335, 87126 55686 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement