● ఎడారిని తలపిస్తున్న పులికాట్ దీవులు
● ఉపాధి కోల్పోయిన గిరిజన మత్స్యకార కుటుంబాలు
వాకాడు: మండలంలోని తీర ప్రాంతంలో గల సముద్ర ముఖద్వారాలు కొంతకాలంగా పూడిపోయాయి. దీంతో పులికాట్ సరస్సులోని అంతర్ భాగమైన ఉప్పు పరలు ఎండిపోయి ఎడారిని తలపిస్తున్నాయి. సరస్సు ఆధారంగా చేపల వేట సాగించే 13 గ్రామాలకు చెందిన గిరిజన మత్స్యకార కుటుంబాలు ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్నాయి. వేట విరామ సమయంలో ఖాళీగా ఉన్న మత్స్యకారులు సైతం ఈ ఉప్పు పరలో వేట చేసి లాభాలు పొందుతారు.
రెండు చోట్ల ముఖద్వారాలు
మండలంలో రెండు చోట్ల మాత్రమే సముద్ర ముఖద్వారాలున్నాయి. పూడిరాయిదొరువు పంచాయతీలోని నవాబుపేట.. దుగరాజపట్నం పంచాయతీలోని కొండూరుపాళెం వద్ద ఇవి ఉన్నాయి. వీటి ద్వారానే సముద్ర ఆటుపోట్ల సమయంలో పులికాట్‌లోకి నీరు వచ్చి వెళ్తుంది. తద్వారా మత్స్య సంపద వృద్ధి చెంది ఎంతో మందికి జీవనోపాధి లభిస్తుంది. అయితే ఇవి సముద్రంలో ఉవ్వెత్తున ఎగసిపడిన కెరటాల కారణంగా ఇసుక మేటలతో పూడిపోయాయి. ఫలితంగా పులికాట్ సరస్సు పరిధిలోని నిడిగుర్తి, పంబలి, బుసపాళెం, గొల్లపాళెం, రెడ్డిపాళెం, మొనపాళెం, నిమ్మవానితిప్ప, మూలపడవ, పంట్రంగం, పామలతేరి, పున్నమానితిప్ప, మాధవాపురం, చినతోట, శ్రీహరిపురం తదితర గ్రామాల మధ్య విస్తరించి ఉన్న ఈ ఉప్పు పరలు ఎండిపోయి ఎండమావులను తలపిస్తున్నాయి.
ఉపాధి కరువు
చిన్న తెప్పల సాయంతో వేట సాగించే గిరిజన మత్స్యకారులు జీవనాన్ని కోల్పోయారు. పులికాట్ సరస్సు జలాలతో మండలంలోని దాదాపు 970 మత్స్యకారులు, గిరిజనులు తెప్ప ఆధారంగా చేపలు, పీతలు, రొయ్యలను పట్టుకొని గ్రామాల్లో విక్రయించి జీవనం సాగించేవారు. అయితే ప్రస్తుతం వీరంతా రోజువారీ కూలీలుగా మారి అవస్థలు పడుతున్నారు.
గతమెంతో ఘనం
గతంలో ఏడాది పొడవునా పులికాట్ జలకళతో కనువిందు చేసేది. దీనికి తోడు సముద్ర ఆటుపోట్లకు ఉప్పు నీరు సరస్సులోకి రావడం.. తిరిగి వెళ్లిపోవడం ఒక అనుభూతిగా ఉండేది. అంతేకాకుండా ఈ ఉప్పుకయ్యల్లో విదేశీ వలస పక్షులు ఎంతో ఉత్సహంగా, ఉల్లాసంగా రెండు నెలలపాటు ఉండి సేదదీరి వెళ్లేవి. అయితే కొంత కాలంగా నీరు లేక వీటి రాక కానరావడంలేదు. సముద్రంపై వేట విరామ సమయంలో మత్స్యకారులు, గిరిజన కుటుంబాలు ఈ కాలువలోనే వేట చేసుకుంటూ జీవనం సాగించేవారు. పూడిపోయిన ముఖద్వారాల విషయంలో శాశ్వత పరిష్కారం చూపే వారు లేకపోవడంతో కళావిహీనంగా మారి ఎడారిని తలపిస్తున్నాయి.
ఉప్పు పరల్లో సైతం ఆక్రమణలు
కొందరు అధికార పార్టీ నేతల అండ చూసుకొని పులికాట్ సరస్సులో ఉప్పు పరలను సైతం వదలకుండా ఆక్రమించుకొని దర్జాగా అనుభవిస్తున్నారు. గతంలో పులికాట్ సరస్సులోకి సముద్ర జలాలు రాకపోతే వెంటనే స్పందించి ముఖద్వార పూడికతీతకు కసరత్తు చేసేవారు. అయితే ప్రస్తుతం కంచె చేను మేసిన చందంగా సముద్ర ముఖద్వారాల పూడిక తీయించే వారే ఉప్పుపరల ఆక్రమణదారులు కావడంతో ఎడారిని తలపిస్తున్నాయి. తీర ప్రాంతంలో పలు పరిశ్రమలొస్తాయనే ముందు చూపుతో కొందరు ఆక్రమణలకు తెరదీస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


