అది మహానాడు కాదు.. మాయనాడు | - | Sakshi
Sakshi News home page

అది మహానాడు కాదు.. మాయనాడు

May 31 2026 1:06 AM | Updated on May 31 2026 1:06 AM

నెల్లూరు రూరల్‌: టీడీపీ ఇటీవల నిర్వహించిన మహానాడు.. ప్రజలను భ్రమల్లో ముంచెత్తే ఓ మాయనాడు అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాకాణి పూజిత విమర్శించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శనివారం ఆమె మాట్లాడారు. ప్రజలకు టీడీపీ నేతలేమి చేశారో చెప్పుకోలేక, గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు చేసేందుకే పరిమితమయ్యారని ధ్వజమెత్తారు. పబ్లిసిటీ కోసం ప్రజాధనాన్ని టీడీపీ విచ్చలవిడిగా దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అయితే మహానాడు వేదికలపై వీరి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. మహానాడుకు వీఓఏల ద్వారా డ్వాక్రా సభ్యులు, మహిళా సంఘాల సభ్యులను భయపెట్టి బలవంతంగా తీసుకెళ్లారని ధ్వజమెత్తారు. టీడీపీని మహిళలు ఛీదరిస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతల ముఖాలను చూసేందుకు సైతం మహిళలు ఇష్టపడటం లేదనే విషయం మహానాడు సభ ద్వారా స్పష్టంగా అర్థమవుతోందని పేర్కొన్నారు. వీరికిచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. అతివల ఓట్ల కోసం టీడీపీ నేతలు మాయమాటలు చెప్తూ నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తున్నా, ఆడబిడ్డ నిధి హామీని ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. వీటిపై ప్రశ్నిస్తే, డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెరలేపుతున్నారని ధ్వజమెత్తారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లపై అధికార పార్టీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. హామీలను నెరవేర్చకుండా మాటలు చెప్పేందుకే సర్కార్‌ పరిమితమైందని తెలిపారు. గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన దిశ యాప్‌ను కాపీ కొట్టి.. శక్తి యాప్‌ను తెచ్చామంటూ చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అత్యవసర సమయాల్లో శక్తి యాప్‌ సక్రమంగా నిర్వహించడంలేదంటూ కేంద్రం చీవాట్లు పెట్టిన అంశాన్ని మర్చిపోయారానని ప్రశ్నించారు. జగనన్న పాలనలోనే మహిళలకు రక్షణ ఉండేదని గుర్తుచేశారు. అంగన్‌వాడీ ఆయాలు, ఆశ వర్కర్ల జీతాలను పెంచామంటూ కూటమి నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.

పొగడ్తలకే పరిమతం

మహానాడులో చంద్రబాబు, లోకేశ్‌ను పొగడటం.. జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం మినహా రాష్ట్ర ప్రజలకు ఏమి చేశారో చెప్పలేకపోయారని విమర్శించారు. మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చారని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీలో జరుగుతున్న మోసాలను నిలదీస్తుంటే, తమ పార్టీ శ్రేణులపై కేసులను అక్రమంగా బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. వీటికెవరూ భయపడబోరని తేల్చిచెప్పారు. మహిళల ఆర్థిక స్వావలంబన, సామాజిక సాధికారత జగనన్నతోనే సాధ్యమయ్యాయని తెలిపారు. సమాజ సేవ చేయాలనే తపన ఉన్న మహిళలను ప్రోత్సహిస్తూ వారికి పదవుల్లో అనేక అవకాశాలను తమ పార్టీ అధినేత కల్పించారని వివరించారు. జగనన్న చేసిన మంచి, అభివృద్ధిని చూసి ఓర్వలేక క్రెడిట్‌ చోరీకి పాల్పడే యత్నాలను మానుకోవాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, మహిళలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement