జెడ్పీలో కారుణ్య నియామకాలు | - | Sakshi
Sakshi News home page

జెడ్పీలో కారుణ్య నియామకాలు

May 31 2026 1:06 AM | Updated on May 31 2026 1:06 AM

నెల్లూరు(పొగతోట): జిల్లా పరిషత్‌ యాజమాన్య పరిధిలో పనిచేస్తూ మరణించిన ఉద్యోగులకు సంబంధించి వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించారు. ఈ మేరకు శనివారం ఉద్యోగాలకు సంబంధించిన ఉత్తర్వులను జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ, డిప్యూటీ సీఈఓ విజయకుమార్‌ అభ్యర్థులకు అందించారు. ఇద్దరికి ఆఫీస్‌ సబార్డినేట్లుగా ఉద్యోగాలు కల్పించారు.

బల్కర్‌ అదుపుతప్పి.. లోయలో పడి..

రెండు ఆవుల మృతి

సీతారామపురం: సీతారామపురం– పోరుమామిళ్ల ఘాట్‌రోడ్డు మార్గంలో శనివారం వేకువజామున సిమెంట్‌ బల్కర్‌ లారీ ఓ మలుపు వద్ద అదుపుతప్పి లోయలో పడింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి సిమెంటు పౌడర్‌ లోడుతో చిన్నాగంపల్లి గ్రామ సమీపాన జరుగుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనుల వద్దకు బయల్దేరిన బల్కర్‌ మార్గమధ్యలోని ఘాట్‌రోడ్డులో ఓ మలుపు వద్దకు వచ్చేసరికి డ్రైవర్‌ కునుకు తీయడంతో అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొని సుమారు 150 అడుగుల లోతులో పడింది. ఈ ఘటనలో రెండు ఆవులు సైతం మృత్యువాత పడ్డాయి. డ్రైవర్‌ సదానంద స్వల్ప గాయాలపాలై బిగ్గరగా కేకలు వేయడంతో సమీపాన రోడ్డు పనులు చేస్తున్న వ్యక్తులు గమనించి 108కి సమాచారం అందించారు. క్షతగాత్రుడిని ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు.

నేడూ విద్యుత్‌ బిల్లులను చెల్లించొచ్చు

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ విద్యుత్‌ బిల్లులు చెల్లించవచ్చని ఎస్పీడీసీఎల్‌ జిల్లా సర్కిల్‌ ఎస్‌ఈ రాఘవేంద్రం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని విద్యుత్‌ బిల్లుల వసూళ్ల కేంద్రాలు యథావిధిగా పనిచేస్తాయని, ఈ అవకాశాన్ని జిల్లా విద్యుత్‌ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రేమిస్తున్నాడనే నెపంతో..

తండ్రీ కుమారుడిపై దాడి

విడవలూరు: తన సోదరిని ప్రేమిస్తున్నాడనే నెపంతో ఓ యువకుడిపై, అతని తండ్రిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన మండలంలోని ముదివర్తి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. ముదివర్తి గ్రామం దళితవాడకు చెందిన నెల్లూరు శీనయ్య, చిన్న కుమారుడు నెల్లూరు నిరీష్‌కుమార్‌ అదే గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమిస్తున్నానని చెబుతూ వేధిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈనెల 16వ తేదీ ఆ యువతి కుటుంబ సభ్యులు విజయలక్ష్మి, మోచర్ల పరంధామయ్య, సాయికుమార్‌, ఇంద్రజ మరికొందరు కలిసి శీనయ్య ఇంటికి వెళ్లారు. అక్కడ నిరీష్‌కుమార్‌ను అసభ్య పదజాలంతో దూషస్తూ, చేతులు, కాళ్లతో తీవ్రంగా కొట్టారు. ఆ సమయంలో అడ్డొచ్చిన నిరీష్‌కుమార్‌ తండ్రి శీనయ్యను తోసివేయడంతో ఆయన కిందపడిపోయాడు. ఆయన శరీరంలో అంతర్గత గాయాలయ్యాయి. శీనయ్యను అతని భార్య చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొంది కోలుకున్న శీనయ్య శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై నరేష్‌ తెలియజేశారు.

దోపిడీ కేసులో

నిందితుడి అరెస్ట్‌

నెల్లూరు(క్రైమ్‌): ఫైనాన్స్‌ పేరుతో లారీ డ్రైవర్‌ను బెదిరించి నగదు దోచుకెళ్లిన కేసులో నిందితుడిని బాలాజీనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాగయ్య లారీ డ్రైవర్‌. ఆయన రెండురోజుల కిందట హైదరాబాద్‌ నుంచి మైదా పిండి లోడ్‌ను చైన్నెకు తీసుకెళ్లారు. అక్కడ లోడ్‌ను దింపి శుక్రవారం హైదరాబాద్‌కు బయలుదేరారు. రాత్రి నెల్లూరు ఎన్టీఆర్‌ నగర్‌ జాతీయరహదారిపై భోజనం చేసేందుకు ఆగారు. ఈక్రమంలో నాలుగో మైలుకు చెందిన వినోద్‌ అతని వద్దకు వెళ్లి ఫైనాన్స్‌ కంపెనీ ప్రతినిధిగా పరిచయం చేసుకున్నాడు. ఈఎంఐ చెల్లించనందున లారీని సీజ్‌ చేస్తామని డ్రైవర్‌ను బెదిరించి రూ.2 వేల నగదు దోచుకెళ్లాడు. బాధితుడు నాగయ్య ఫిర్యాదు మేరకు బాలాజీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి శనివారం నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement