● నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్‌సీ–ఆర్‌ఐఎంఈ 2026
జాతీయ సదస్సు
నెల్లూరు టౌన్: కృత్రిమ మేధస్సు, అనలిటిక్స్, ఫిన్‌టెక్ వంటి ఆధునిక సాంకేతిక పరిణామాలు వ్యాపార రంగాన్ని వేగంగా మార్చుతున్న నేపథ్యంలో మేనేజ్‌మెంట్ విద్య కూడా కాలానుగుణంగా రూపాంతరం చెందాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. నారాయణ ఇంజినీరింగ్ కళాశాల ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్‌సీ–ఆర్‌ఐఎంఈ 2026 జాతీయ సదస్సును నిర్వహించారు. ఏఐ అనలిటిక్స్, ఫిన్‌టెక్ యుగానికి అనుగుణంగా ఎంబీఐ విద్యను ఎలా పునర్నిర్మించాలనే అంశంపై విస్తృత చర్చలు జరిగాయి. యోగి వేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ బి. రాజశేఖర్ బెల్లంకొండ మాట్లాడుతూ భవిష్యత్ వ్యాపార ప్రపంచం అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎంబీఏ విద్యలో కృత్రిమ మేధస్సు, డేటా విశ్లేషణ, ఫిన్‌టెక్ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్వీఆర్ జ్యోతికుమార్ మాట్లాడుతూ సంప్రదాయ బోధనా విధానాలు మారుతున్న నేపథ్యంలో విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతోపాటు నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలు, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, పరిశోధన, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాల అభివృద్ధి నేటి అవసరమన్నారు. అంతర్జాతీయ స్థాయి పోటీతత్వాన్ని ఎదుర్కొనేలా మేనేజ్‌మెంట్ విద్యలో నూతన మార్పులు తీసుకురావాలని సూచించారు. మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ ఏఐ, అనలిటిక్స్, ఫిన్‌టెక్ ఆధారిత విద్య భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దుతుందన్నారు. నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ డైరెక్టర్ ఇందిర పొంగూరు మాట్లాడుతూ మేనేజ్‌మెంట్ విద్య కేవలం వ్యాపార విజ్ఞానానికి పరిమితం కాకుండా ఏఐ, డేటా అనలిటిక్స్, ఫిన్‌టెక్ వంటి ఆధునిక రంగాలతో అనుసంధానం కావాల్సిన అవసరం ఉందన్నారు. సదస్సు డైరెక్టర్, ఎంబీఏ డీన్ డాక్టర్ గంగినేని ధనంజయ్ మాట్లాడుతూ మేనేజ్‌మెంట్ విద్యలో వస్తున్న నూతన ధోరణులకు ఎన్‌సీ–ఆర్‌ఐఎంఈ 2026 వేదికగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ పరిశోధన పత్రాలు సమర్పించిన విద్యార్థులు, పరిశోధకులకు ‘బెస్ట్ పేపర్ అవార్డులు’ ప్రదానం చేశారు. ఉపకులపతుల సమక్షంలో పరిశోధనా పత్రాల సంకలన గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉత్తమ అధ్యాపకులకు ‘బెస్ట్ బిజ్ గురు అవార్డులు’ ప్రదానం చేశారు. రాయలసీమ ప్రాంతంలో కామర్స్, ఫైనాన్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్ విద్యాభివృద్ధికి విశేష సేవలందించిన అధ్యాపకులను సత్కరించారు. జనరల్ మేనేజ్‌మెంట్ విభాగంలో డాక్టర్ ఎంఆర్‌ఎస్ సూర్యనారాయణరెడ్డి, ఫైనాన్స్ విభాగంలో డాక్టర్ పి. సుబ్రహ్మణ్య చారి, మార్కెటింగ్ విభాగంలో ఆచార్య వి.రమేష్, హెచ్‌ఆర్ విభాగంలో డాక్టర్ ఎం. నీరజ ఉత్తమ అధ్యాపక అవార్డులు అందుకున్నారు. ప్రముఖ విద్యావేత్త ఆచార్య కె. వేణుగోపాల్‌రావుకు ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ ప్రదానం చేశారు.


