పాల ట్యాంకర్‌ రూపంలో వెంటాడిన మృత్యువు | - | Sakshi
Sakshi News home page

పాల ట్యాంకర్‌ రూపంలో వెంటాడిన మృత్యువు

May 31 2026 1:06 AM | Updated on May 31 2026 1:06 AM

ఒక్కగానొక్క కుమారుడి మృతితో

తీరని విషాదం

దగదర్తి: అక్క ఇంటి వద్ద మేనల్లుడిని దింపి, తిరిగి స్వగ్రామానికి బయలుదేరిన యువకుడిని పాల ట్యాంకర్‌ రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటన దగదర్తి మండల పరిధిలోని సున్నపుబట్టి జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. అల్లూరు మండలం ఇసుకపల్లికి చెందిన దగ్గోలు పృథ్విరాజ్‌ (22) అక్క వెంకటాచలం మండలం కనుపూరులో ఉంటోంది. వేసవి సెలవులు కావడంతో మేనల్లుడిని ఇసుకపల్లికి తీసుకెళ్లి కొద్దిరోజులు ఉంచాడు. అనంతరం శనివారం తిరిగి బాలుడిని అక్క ఇంటి వద్ద దింపి, స్వగ్రామానికి బయలుదేరాడు. అయితే సున్నపుబట్టి సమీపానికి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన పాల ట్యాంకర్‌ అతని బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు పృథ్విరాజ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేంద్ర తెలిపారు.

అండగా నిలవాల్సిన వయస్సులో

అనంతలోకాలకు..

రాఘవులు, సరోజనమ్మ దంపతులు ఇసుకపల్లిలో నివాసం ఉంటున్నారు. వారు కూలి పనులు చేస్తుంటారు. వారికి కుమార్తె, కుమారుడు సంతానం. కుమార్తెకు వివాహం చేశారు. పృథ్విరాజ్‌ వారికి ఒక్కగానొక్క కుమారుడు. కుటుంబానికి అండగా నిలవాల్సిన వయసులోనే అతను దూరం కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉదయం ఇంటి నుంచి వెళ్లిన కుమారుడు సాయంత్రానికి శవంగా మారడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. బంధువులు, గ్రామస్తులు కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు ప్రయత్నించినా వారి రోదనలు ఆగలేదు. కుటుంబానికి భరోసాగా, భవిష్యత్తుకు ఆశాకిరణంగా ఉన్న యువకుడు అకాల మరణం చెందడంతో ఇసుకపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement