● రూ.2.31 లక్షల సొత్తు రికవరీ
ఆత్మకూరు: పొలాల్లోని ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు పగులగొట్టి అందులోని తాగి తీగలను చోరీ చేసే ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీఐ జి.గంగాధర్ తెలిపారు. డీఎస్పీ వేణుగోపాల్ ఆదేశాల మేరకు సర్కిల్ కార్యాలయంలో శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఏఎస్‌పేట మండలం పొనుగోడు గ్రామానికి చెందిన దేవరకొండ ఫణీంద్రకుమార్, ఆత్మకూరు ఎల్‌ఆర్‌పల్లికి చెందిన కటారి శ్రీచరణ్, అనంతసాగరం మండలం అగ్రహారం గ్రామానికి చెందిన చేవూరి వెంకటేశ్వర్లు, ఆత్మకూరు మండలం ఆరవేడు కాలనీకి చెందిన శనగల ముత్యాలు ముఠాగా ఏర్పడి జల్సాల కోసం పొలాల్లోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లను పగులగొట్టి అందులోని రాగి తీగలను చోరీ చేసి విక్రయిస్తుంటారు. గతంలో వీరు 19 ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు పగులగొట్టి రూ.2.73 లక్షల విలువైన రాగి తీగలను చోరీ చేశారని, అందులో రూ.2.31 లక్షల విలువైన సొత్తును రికవరీ చేసినట్లు వివరించారు. రెండు రోజుల క్రితం ఆత్మకూరు సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ పగులగొట్టేందుకు ప్రయత్నిస్తుండగా, నలుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ కేసును ఛేదించిన సీఐ గంగాధర్, ఎస్సైలు జంపనికుమార్, కె.శ్రీనివాసులురెడ్డి, కానిస్టేబుళ్లను డీఎస్పీ వేణుగోపాల్, ఎస్పీ అజితా వేజెండ్ల ప్రశంసించి రికార్డులు ప్రకటించారు.


