నెల్లూరు(క్రైమ్): మహిళలు, బాలికలపై జరిగే నేరాలను అరికట్టడం, బాధితులకు వేగవంతమైన న్యాయం అందించడమే లక్ష్యంగా ఆపరేషన్ దండాయన కార్యక్రమాన్ని జిల్లాలోనూ పటిష్టంగా అమలుచేస్తామని ఎస్పీ అజితా వేజెండ్ల పేర్కొన్నారు. నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఆమె పోలీసు అధికారులతో కలిసి ఆపరేషన్ దండాయన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో గడిచిన రెండేళ్లలో మహిళలపై నేరాలు, పోక్సో కేసులకు సంబంధించి 43 కేసుల్లోని నిందితులకు శిక్షలు పడ్డాయన్నారు. వాటిలో 10 కేసుల్లో యావజ్జీవ, ఏడు కేసుల్లో 20 ఏళ్లకుపైగా, 3 కేసుల్లో పదేళ్లకుపైగా, రెండు కేసుల్లో ఏడేళ్లుకుపైగా, ఐదు కేసుల్లో ఐదేళ్లకుపైగా, మిగిలిన కేసుల్లో ఐదేళ్లలోపు శిక్షలు పడ్డాయన్నారు. ఏడాదిలో మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించి 159 కేసులు నమోదు కాగా 193 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. 72 మందిపై ఎస్‌ఓఎస్(సెక్సువల్ అఫెండర్ షీట్) తెరిచి వారి కదలికలపై నిఘా ఉంచామన్నారు. ఏఎస్పీలు సీహెచ్ సౌజన్య, దీక్ష, మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్లు టీవీ సుబ్బారావు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


