నెల్లూరురూరల్: యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ప్రతినిధుల బృందం బుధవారం నెల్లూరులో పర్యటించింది. వారు జిల్లాలోని సముద్ర ఆహార ప్రాసెసింగ్ క్లస్టర్‌ను పరిశీలించి, ఎగుమతుల విస్తరణ అవకాశాలపై అధ్యయనం చేశారు. పర్యటనలో భాగంగా బృందం నార్త్ రాజుపాళెం, గండవరం ప్రాంతాల్లోని పలు రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లను సందర్శించింది. ప్రతినిధులతో సమావేశమై ఉత్పత్తి, ఎగుమతి అవకాశాలపై చర్చలు జరిపారు. ఈ పర్యటనలో జిల్లా పరిశ్రమల కేంద్రం ఉప సంచాలకుడు శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.
కోళ్ల వ్యర్థాలు
తరలిస్తుండగా..
● వాహనం పట్టివేత
సీతారామపురం: కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్న వాహనాన్ని బుధవారం సీతారామపురం పోలీసులు పట్టుకున్నారు. వారి కథనం మేరకు.. బెంగళూరు నుంచి నెల్లూరుకు కోళ్ల వ్యర్థాలను మినీ లారీలో తరలిస్తున్నారని, నారాయణప్పపేట చెక్‌పోస్టు దాటి వెళ్తోందన్న సమాచారం పోలీసులకు అందింది. వారు వెంటనే స్పందించి వాహనాన్ని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యర్థాలను గ్రామానికి దూరంగా పెద్ద గొయ్యి తీసి పూడ్చి పెట్టారు. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హానికరంగా ఉన్న నిషేధిత కోడి వ్యర్థాలను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. కేసు నమోదు చేశారు.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను కాపాడి..
● కుటుంబ సభ్యులకు అప్పగింత
చిల్లకూరు: ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకోవాలని రైలు కోసం ఎదురు చూస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను రైల్వే పోలీసులు కాపాడి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటన గూడూరు రైల్వే స్టేషన్‌లో బుధవారం జరిగింది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. హైదరాబాద్‌కు చెందిన ముఖేష్‌కుమార్ సింగ్ చైన్నెలోని టీసీఎస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడికి ఆర్థిక సమస్యలున్నాయి. కంపెనీ నుంచి సొంతింటికి బయలుదేరి దారిలో ఆత్మహత్య చేసుకోవాలని గూడూరు రైల్వేస్టేషన్ వద్ద దిగేశాడు. నెల్‌క్యాస్ట్ ప్రాంతంలో పట్టాలపై కూర్చొని ఉండగా రైల్వే పోలీసులు గుర్తించి వివరాలను సేకరించారు. కుటుంబ సభ్యులను పిలిపించి అతడిని అప్పగించినట్లు వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ మస్తానయ్య, గూడూరు రైల్వే హెడ్ కానిస్టేబుల్ సుదర్శన్ తెలిపారు.


