
నకిలీ ఏటీఎం కార్డులిచ్చి..
ఆత్మకూరు: నగదు తీసుకునేందుకు ఏటీఎంల వద్దకు వెళ్లే వారిని మోసం చేసి కార్డు, పిన్ నంబర్లను తెలుసుకుని నగదు దోచుకుంటున్న వ్యక్తిని కొందరు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్థానికులు, ఎస్సై జిలానీ కథనం మేరకు.. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మట్టిపాడు గ్రామానికి చెందిన సురేంద్ర అనే యువకుడు ఏటీఎంల వద్ద ప్రజలను ఏమారుస్తుంటాడు. నగదు విత్‌డ్రా చేయాలని కోరుతూ కార్డులిచ్చే వారిని మోసం చేస్తుంటాడు. పిన్ నంబర్ తెలుసుకుని నకిలీ కార్డు చేతిలో పెడుతుంటాడు. గురువారం ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ సమీపంలోని ఓ బ్యాంక్ ఏటీఎం వద్ద వృద్ధుడికి నగదు తీసుకోవడంలో సహాయం చేస్తానని నమ్మించాడు. ఆయన కార్డు తీసుకుని పిన్ నంబర్ తెలుసుకుని నగదు డ్రా చేసి నకిలీ కార్డు ఇచ్చాడు. కొద్దిసేపటి అనంతరం మరో యువకుడికి ఇలానే చేయబోగా సురేంద్ర మోసాన్ని పసిగట్టి సమీపంలోని వారి సహకారంతో పట్టుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై పరిశీలించగా సురేంద్ర వద్ద పలు నకిలీ ఏటీఎం కార్డులు లభించాయి. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఇప్పటికే కేసులు నమోదైనట్లు గుర్తించారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అసలు వాటితో నగదు కొల్లగొడుతున్న వ్యక్తి
పోలీసులకు అప్పగించిన స్థానికులు