
చెలరేగిపోతున్న తమ్ముళ్లు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగు తమ్ముళ్లు అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారు. కొండలు, గుట్టలను కరిగిస్తూ యథేచ్ఛగా అమ్మకాలు సాగించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా పొదలకూరు మండలం తాటిపర్తి పంచాయతీ సమీపంలో ఉన్న గొల్లకందుకూరు తిప్పను కరిగిస్తున్నారు. రెండు రోజులుగా రేయింబవళ్లు యంత్రాలతో కొండను తవ్వేస్తూ నెల్లూరుకు గ్రావెల్‌ను తరలిస్తున్నారు. గతంలో పొదలకూరు లేఅవుట్లకు తరలించిన అక్రమార్కులు కొంతకాలం నిలిపివేశారు. తిరిగి నెల్లూరుకు గ్రావెల్ తరలింపు చేపట్టారు. మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు అటు వెళ్లేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారు. ముందుగా నెల్లూరు శివారు ప్రాంతాల్లో వేసే లేఅవుట్ల యజమానులతో మాట్లాడుకున్నారు. గ్రావెల్ తవ్వి టిప్పర్లకు లోడ్ చేసినందుకు ట్రిప్పునకు రూ.4 వేలు వంతున కమీషన్‌ను తమ్ముళ్లు తీసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. ఇదే పంచాయతీలో ఇటీవల నెలరోజులపాటు అక్రమంగా గ్రావెల్‌ను తరలించి సొమ్ము చేసుకున్నారు.
గ్రావెల్ తవ్వకాలు
తరలిపోతున్న గ్రావెల్
కరుగుతున్న గొల్లకందుకూరు తిప్ప