
న్యూఢిల్లీ: కరోనాతో టెస్టు చాంపియన్ ఎవరనేది వచ్చే ఏడాది తేలకపోవచ్చు. టి20 ప్రపంచకప్‌పైనే కాదు... ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)పైనా వైరస్ ప్రభావం పడింది. వచ్చే ఏడాది జూన్‌లో లార్డ్స్ వేదికగా జరగాల్సిన డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా వాయిదా పడే అవకాశం ఉందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జనరల్ మేనేజర్ జెఫ్ అలార్డీస్ అన్నారు. మహమ్మారి వల్ల పలు దేశాల మధ్య టెస్టు సిరీస్‌లు జరగకపోవడమే ఇందుకు కారణమని ఆయన వెల్లడించారు. ‘ఇప్పటికే చాలా సిరీస్‌లు వాయిదా పడ్డాయి... ముందు ముందు ఇంకెన్ని సిరీస్‌లపై దీని ప్రభావం వుంటుందో చెప్పలేం. ఏదేమైనా ఈ సిరీస్‌ల రీషెడ్యూలుపైనే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆధారపడింది. ఈ నేపథ్యంలో వచ్చే జూన్‌లో ఫైనల్ కష్టమే’ అని అలార్డీస్ అన్నారు.