
ఇద్దరూ క్లాస్‌మేట్స్.. ఆ అబ్బాయేమో గుంభనంగా ఉంటాడు.. పుస్తకాల పురుగు.. ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతాడు.. ఆ అమ్మాయి మాత్రం చలాకీ.. హుషారైన పిల్ల.. చుట్టూ ఉన్నవాళ్లతో ఇట్టే కలిసిపోతుంది.. మూడీగా ఉన్నవాళ్ల ముఖంలో చిరునవ్వులు తెప్పించగలదు..
ఇలా భిన్నమైన మనస్తత్వాలు ఉన్న ఆ ఇద్దరు.. పెద్దయ్యాక ప్రేమలో పడ్డారు.. చిన్ననాటి నుంచి అతడు ఆమెపై పెంచుకున్న ఇష్టాన్ని తెలిపేందుకు ‘ఐపీఎల్’ అవకాశాన్ని ఇచ్చింది. ఇద్దరూ కలిసి ఒకే జట్టుకు పనిచేశారు.. అతడేమో ఆటగాడు.. ఆమె ఆ జట్టు సోషల్ మీడియా అకౌంట్ మేనేజర్.
మాటలు, మనసులు కలిశాయి.. పెళ్లి బంధంతో ఇద్దరూ ఒక్కటయ్యారు.. ఇద్దరు చక్కటి, ముత్యాల్లాంటి పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.. ఇప్పుడతడు ఆటకు వీడ్కోలు పలికాడు.. ఐపీఎల్ నుంచీ వైదొలిగాడు.. ఇక అతడి సమయమంతా మాతోనే అని ఆమె సంబరపడిపోలేదు.
‘‘లవ్ యూ.. నువ్వు నీ కొత్త ప్రయాణంలో మరింత గొప్పగా ముందుకు సాగాలి.. శిఖరాగ్రాలను అధిరోహించాలి’’ అని భర్తను ప్రోత్సహించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానంటూ ప్రేమను చాటుకుంది. టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin)- ప్రీతి నారాయణన్ (Priti Narayanan) గురించే ఈ ఉపోద్ఘాతమంతా!

చెన్నైకి చెందిన అశ్విన్- ప్రీతి క్లాస్‌మేట్స్. ఒకే స్కూళ్లో చదివారు. అయితే, క్రికెట్‌లో రాణించే క్రమంలో అశూ స్కూల్ మారినా.. ప్రీతితో మాత్రం టచ్‌లోనే ఉన్నాడు. ఆమె ఈవెంట్ మేనేజర్‌గా కెరీర్ నిర్మించుకుంటే.. అశూ టీమిండియా కీలక స్పిన్నర్‌గా ఎదిగాడు.
ఈ క్రమంలోనే అశ్విన్ ఐపీఎల్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లో చేరగా.. ప్రీతి అదే జట్టు సోషల్ మీడియా అకౌంట్ మేనేజర్‌గా వచ్చింది. అప్పుడే ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా రూపాంతరం చెందింది. ప్రీతిని కలిసిన పదేళ్ల తర్వాత అశూ తన ప్రేమను తెలపగా.. అందుకు ఆమె సమ్మతించింది.
కపుల్‌గోల్స్
పెద్దల అంగీకారంతో ఆ జంట 2011లో పెళ్లిపీటలు ఎక్కింది. అశూ- ప్రీతిలకు కుమార్తెలు అకీరా, ఆధ్య సంతానం. పద్నాలుగేళ్లుగా ఒకరికొకరు అండగా ఉంటూ కలిసి అడుగులు వేస్తున్న ఈ జంట కపుల్‌గోల్స్ సెట్ చేయడంలో ముందుంటారు.
ఇక అశ్విన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా.. ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పేశాడు. తదుపరి విదేశీ లీగ్‌లలో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో అతడిని చీర్ చేస్తూ ప్రీతి ఉద్వేగపూరిత పోస్ట్ పెట్టగా.. వీరి ప్రేమకథ మరోసారి తెరమీదకు వచ్చింది.
అందుకే ఐపీఎల్‌కూ వీడ్కోలు
కాగా గతేడాది చివర్లో టెస్టు రిటైర్మెంట్ తర్వాత 2025 సీజన్ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగాడు. తన సొంత టీమ్‌వంటి సీఎస్‌కేతో మరికొంత కాలం లీగ్‌లో సాగాలని అతను భావించాడు.
అయితే పరిస్థితులు మారిపోవడంతో లీగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వేలంలో రూ.9.75 కోట్లతో చెన్నై అశ్విన్‌ను ఎంచుకోగా 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అతను పూర్తిగా విఫలమయ్యాడు. ఏకంగా 9.12 ఎకానమీతో 7 వికెట్లు మాత్రమే తీశాడు.
సీఎస్‌కే యాజమాన్యం కూడా యువకులతో జట్టును పునర్నిర్మించే ప్రయత్నంలో భాగంగా అశ్విన్‌ను కొనసాగించే ఉద్దేశం లేదని పరోక్షంగా చెప్పేసింది. 39 ఏళ్ల వయసులో కొత్త ఫ్రాంచైజీ ఎంచుకునే అవకాశాలు కూడా తక్కువగా ఉండటంతో అతను లీగ్ నుంచి రిటైర్ అయ్యాడు. 2009లో తొలిసారి లీగ్‌లోకి అడుగు పెట్టిన అతను వరుసగా ఏడు సీజన్ల పాటు సీఎస్‌కే తరఫునే బరిలోకి దిగాడు.
ఆ విదేశీ లీగ్‌లలో కనిపించే అవకాశం
ఆ తర్వాత పుణే సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ టీమ్‌ల తరఫున కూడా ఆడాడు. 221 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 7.20 ఎకానమీతో 187 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల జాబితాలో అతను ఐదో స్థానంలో నిలిచాడు.
అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటన చేయడంతో ఇకపై అశ్విన్ ఇతర విదేశీ లీగ్‌లలో ఆడేందుకు బీసీసీఐ అనుమతిస్తుంది. మున్ముందు బిగ్‌బాష్, ఎస్‌ఏటి20, సీపీఎల్, హండ్రెడ్ తదితర టోర్నీలలో అతను కనిపించే అవకాశం ఉంది.