
టీమిండియా ఉత్తమ ఫాస్ట్‌బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు మహ్మద్ షమీ (Mohammed Shami). ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ కుడిచేతివాటం పేసర్ దేశీ క్రికెట్‌లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ జాతీయ జట్టులోకి వచ్చాడు. అంచెలంచెలుగా ఎదిగి భారత పేస్ విభాగంలో కీలక ఆటగాడిగా మారాడు.
అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 64 టెస్టులు, 108 వన్డేలు, 25 టీ20 మ్యాచ్‌లు ఆడిన షమీ.. ఆయా ఫార్మాట్లలో 229చ 206, 27 వికెట్లు కూల్చాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా టీమిండియాకు చివరగా ఆడిన షమీ.. ప్రస్తుతం దులిప్ ట్రోఫీ-2025 టోర్నీతో బిజీగా ఉన్నాడు.
సాఫీగా సాగని వ్యక్తిగత జీవితం
ఆట పరంగా ఉన్నత శిఖరాలకు చేరుకున్న 34 ఏళ్ల షమీ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్‌లో చీర్ లీడర్‌గా పనిచేసిన హసీన్ జహాన్ (Hasin Jahan)ను ప్రేమించిన షమీ 2014లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది.
అయితే, కొన్నేళ్ల క్రితం వీరి బంధం బీటలు వారగా.. హసీన్ జహాన్ షమీపై సంచలన ఆరోపణలు చేసింది. షమీ స్త్రీలోలుడని, మ్యాచ్ ఫిక్సింగ్‌లు చేస్తాడని.. తనపై గృహహింసకు పాల్పడ్డాడంటూ తీవ్ర ఆరోపణలతో అతడిని కోర్టు మెట్లు ఎక్కించింది. అంతేకాదు.. భరణంగా నెలకు రూ. 10 లక్షలు చెల్లించేలా తీర్పునివ్వాలని న్యాయస్థానానికి విన్నవించుకుంది.
తొలిసారి స్పందించిన షమీ
ఈ క్రమంలో ఇటీవలే కోల్‌కతా కోర్టు ఈ విషయంలో తీర్పునిచ్చింది. నెలకు రూ. 4 లక్షలు భరణంగా చెల్లించాలని షమీని ఆదేశించింది. ఈ పరిణామాల గురించి షమీ తొలిసారి స్పందించాడు. ‘‘ఆ విషయాన్ని వదిలేయడమే మంచిది. గతం గురించి నేనెప్పుడూ ఆలోచించను.
జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయంలో ఎవరినీ నిందించాలని అనుకోవడం లేదు. నన్ను నేను కూడా నిందించుకోను. ప్రస్తుతం నా దృష్టి మొత్తం కేవలం క్రికెట్ మీద మాత్రమే ఉంది. నాకు వివాదాల్లో తలదూర్చడం ఏమాత్రం ఇష్టం లేదు’’ అని షమీ పేర్కొన్నాడు.
వివాదాలకు నేను దూరం
ఈ సందర్భంగా.. భార్య ధనశ్రీ వర్మతో ఇటీవల విడాకులు తీసుకున్న టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ గురించి షమీకి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘దాని గురించి విచారణ చేయడం మీ పని.
మమ్మల్ని చావు అంచులదాకా తీసుకువెళ్లాలని మీరు ఎందుకు అనుకుంటారు? నాణేనికి మరోవైపు కూడా చూడండి. ముందుగానే చెప్పాను.. నా దృష్టంతా ఆట మీదనే.. వివాదాలకు నేను దూరం’’ అని షమీ కుండబద్దలు కొట్టాడు.