
నేడు మహిళల ముక్కోణపు టోర్నీ ఫైనల్
ఉదయం 10 గంటల నుంచి ఫ్యాన్‌కోడ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
కొలంబో: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటుతున్న భారత మహిళల క్రికెట్ జట్టు... ఆదివారం ముక్కోణపు వన్డే టోర్నమెంట్ ఫైనల్ బరిలోకి దిగనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా... ఆతిథ్య శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది. భారత్, శ్రీలంకతో పాటు దక్షిణాఫ్రికా పాల్గొన్న ఈ టోర్నమెంట్‌లో ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడింట గెలిచిన భారత్... 6 పాయింట్లతో పట్టిక అగ్ర స్థానంలో నిలిచింది. 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, 2 పరాజయాలతో 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి లంక ఫైనల్‌కు చేరింది.
ఈ టోర్నీలో ఒకే ఒక్క మ్యాచ్‌లో శ్రీలంక చేతిలోనే భారత జట్టు ఓడింది. ఇరు జట్ల మధ్య ఫలితం తేలిన 33 మ్యాచ్‌ల్లో భారత్ 30 విజయాలు సాధించగా... లంక మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఈ గణాంకాలే టీమిండియాను ఫేవరెట్‌గా నిలుపుతున్నాయి. ఈ టోర్నీలో భారత జట్టు ఆటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్‌లో సత్తా చాటుతుంటే... శ్రీలంక జట్టు నిలకడలేమితో సతమతమవుతోంది.
ఈ ఏడాది ఆఖర్లో స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌నకు ముందు ఈ టోర్నీని సన్నాహకంగా భావించిన టీమిండియా చక్కటి ప్రదర్శన కనబర్చింది. చివరి పోరులోనూ అదే కొనసాగిస్తూ ట్రోఫీ కైవసం చేసుకోవాలని హర్మన్‌ప్రీత్ బృందం భావిస్తోంది.
సమష్టిగా సత్తా చాటాలని...
టోర్నీలో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్న జెమీమా రోడ్రిగ్స్ 67 సగటుతో 201 పరుగులు చేసింది. అందులో దక్షిణాఫ్రికాపై చేసిన సెంచరీ కూడా ఉంది. ఓపెనర్లు ప్రతీక రావల్ 164, స్మృతి మంధాన 148 పరుగులు చేయగా... ఆల్‌రౌండర్ దీప్తి శర్మ 126 పరుగులు సాధించింది. సఫారీలతో మ్యాచ్‌లో దీప్తి 93 పరుగులతో సత్తాచాటడంతోనే టీమిండియా సునాయాసంగా విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ భారీ ఇన్నింగ్స్‌లు ఆడకున్నా... 41 నాటౌట్, 30, 28 పరుగులతో ఫర్వాలేదనిపించింది.
తుది పోరులో హర్మన్ తన బ్యాట్‌కు పనిచెప్తే భారీ స్కోరు ఖయామే. హర్లీన్ డియోల్, రిచాఘోష్ కూడా మంచి టచ్‌లో ఉండటం టీమిండియాకు కలిసిరానుంది. ఇక బౌలింగ్‌లో స్పిన్నర్ స్నేహ్ రాణా 11 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడేసింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో స్నేహ్ 5 వికెట్ల ప్రదర్శన చేసింది. ఆమెకు దీప్తి శర్మ, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రీ చరణి చక్కటి సహకారం అందిస్తున్నారు.
ఈ ముగ్గురు స్పిన్నర్లను ఎదుర్కొని పరుగులు సాధించడం లంక జట్టుకు శక్తికి మించిన పనే. ఆతిథ్య జట్టు కెపె్టన్ చమరి ఆటపట్టుపై అతిగా ఆధారపడుతోంది. ఆమెతో పాటు హర్షిత సమరవిక్రమ రాణిస్తే భారత్‌కు పోటీ ఎదురవొచ్చు. మూడు, అంతకంటే ఎక్కువ దేశాలు పాల్గొంటున్న టోర్నీలో శ్రీలంక జట్టు ఫైనల్‌కు చేరడం 2009 తర్వాత ఇదే తొలిసారి.
తుది జట్లు (అంచనా)
భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), ప్రతీక రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, అమన్‌జ్యోత్ కౌర్, శ్రీ చరణి, స్నేహ్ రాణా, శుచి ఉపాధ్యాయ్.
శ్రీలంక: చమరి ఆటపట్టు (కెప్టెన్), హాసిని, విష్మి, హర్షిత, నిలాక్షిక, మానుడి, అనుష్క, దేవ్‌మి, సుగంధిక, మల్కి, ప్రియదర్శిని.