హాకీ క్రీడాకారిణి రజనికి ప్రోత్సాహకాలు ప్రకటించిన సీఎం జగన్‌

Womens Hockey Player Rajini Met CM YS Jagan In Amaravati  - Sakshi

సాక్షి, అమరావతి:  టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న హాకీ క్రీడాకారిణి ఇ.రజనికి సీఎం వైఎస్‌ జగన్‌ పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. రూ.25 లక్షల నగదుతోపాటు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను రజని, ఆమె తల్లిదండ్రులు మంగళవారం కలిశారు. రజనిని సీఎం జగన్‌ సత్కరించి జ్ఞాపిక బహూకరించారు. గత ప్రభుత్వంలో రజనికి ప్రకటించిన పెండింగ్‌ బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుపతిలో వెయ్యి గజాల నివాస స్థలం, నెలకు రూ.40 వేల ఇన్సెంటివ్‌ ఇవ్వాలని ఆదేశాలిచ్చారు.
(చదవండి: దివ్యాంగుల జాతీయ క్రికెట్‌ జట్టుకు ఎంపికైన వైఎస్సార్‌ జిల్లా కుర్రాడు)

రాష్ట్రంలో నూతన క్రీడా పాలసీ 
ఒలింపిక్స్‌ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్రంలో నూతన క్రీడా పాలసీని తీసుకురానున్నట్టు పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్‌) తెలిపారు. పాఠశాల దశ నుంచే ఒత్తిడి లేని విద్యనందిస్తూ క్రీడల్లోనూ విద్యార్థులను ప్రోత్సహించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. హాకీ క్రీడాకారిణి ఇ.రజినిని రాష్ట్ర సచివాలయంలో బుధవారం ఘనంగా సన్మానించారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌ హాకీ జట్టులో దక్షిణ భారతదేశం నుంచి పొల్గొన్న ఏకైక క్రీడాకారిణి రజని అని కొనియాడారు. రజనికి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించిన ప్రోత్సాహకాలతోపాటు గత ప్రభుత్వాలు ప్రకటించి విస్మరించిన రూ.67.50 లక్షల నగదు ప్రోత్సాహకాలను సైతం విడుదల చేయనున్నట్టు చెప్పారు.

క్రీడాకారిణి రజిని మాట్లాడుతూ.. 44 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో భారత మహిళా హాకీ జట్టు ప్రదర్శన అందరినీ ఆకట్టుకుందన్నారు. తమ జట్టు పతకానికి కేవలం ఒక అడుగు దూరంలోనే నిలిచిందని, త్వరలో జరగబోయే ఏషియన్, కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు సన్నద్ధమవుతున్నాని చెప్పారు. హాకీలో మరింతగా రాణించేందుకు ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్‌ భార్గవ్, శాప్‌ 
ఎండీ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి, రజని తల్లిదండ్రులు పాల్గొన్నారు. 

110 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. 6 పతకాలు 
రజని స్వగ్రామం చిత్తూరు జిల్లా యనమలవారిపల్లె. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒలింపిక్స్‌ హాకీలో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణిగా ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. 2016లో రియో ఒలింపిక్స్‌తో పాటు టోక్యో ఒలింపిక్స్‌–2020లో కూడా ఆమె పాల్గొన్నారు. 110 అంతర్జాతీయ హకీ మ్యాచ్‌లు ఆడి సత్తా చాటుకున్నారు. 2010 ఏషియన్‌ చాంపియన్‌ ట్రోఫీలో కాంస్యం, 2013 మలేషియాలో జరిగిన ఆసియా కప్‌లో కాంస్యం, అదే ఏడాది జపాన్‌లో జరిగిన ఏషియన్‌ చాంపియన్‌ ట్రోఫీలో రజతం, 2016 సింగపూర్‌లో జరిగిన ఏషియన్‌ చాంపియన్‌ ట్రోఫీ, 2017 జపాన్‌లో జరిగిన ఆసియా కప్‌లో బంగారు పతకాలు, 2018 జకార్తాలో జరిగిన ఏషియన్‌ గేమ్స్‌లో రజత పతకాలు సాధించింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top