
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) సూపర్ సెంచరీతో కదంతొక్కింది. నవీ ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (అక్టోబర్ 23) జరుగుతున్న మ్యాచ్‌లో 88 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసింది.
మంధనకు ఈ ఏడాది ఇది ఐదో శతకం. ఓవరాల్‌గా వన్డేల్లో 14వ శతకం. ప్రస్తుత ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ల్లో నిరాశపరిచిన మంధన.. గత రెండు మ్యాచ్‌లుగా సత్తా చాటుతూ వస్తుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో జరిగిన చివరి రెండు మ్యాచ్‌ల్లో బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలతో మెరిసింది. వాస్తవానికి ఆ రెండు అర్ద సెంచరీలు కూడా సెంచరీల్లోకి మారాల్సింది. అయితే అవి తృటిలో చేజారాయి.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. ఆది నుంచి నిలకడగా ఆడింది. ఓపెనర్లు మంధన, ప్రతీక రావల్ (77) సంయమనంతో బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్‌ను నిర్మించారు.
అర్ద సెంచరీ తర్వాత మంధన గేర్ మార్చగా.. ప్రతీక రావల్ అదే టెంపోలో బ్యాటింగ్ చేస్తుంది. 31 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ వికెట్ నష్టపోకుండా 192 పరుగులుగా ఉంది. మంధన 100, ప్రతీక రావల్ 77 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో మొదటి మూడు సెమీస్ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. నాలుగో సెమీస్ బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. మరోపక్క బంగ్లాదేశ్, పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
చదవండి: IND vs AUS: టీమిండియాపై ఆసీస్ గెలుపు.. సిరీస్ కైవసం